సింగరాయకొండ ఘటనలో జర్నలిస్టులపై పోలీసులు కక్షపూరితంగా కేసులు పెట్టి అరెస్టు చేశారని ప్రకాశం జిల్లా జర్నలిస్టు సంఘాల నాయకులు ఆరోపించారు. న్యాయం చేయాలని కోరుతూ కలెక్టర్ పోలా భాస్కర్‌కు విన్నవించారు. ఒంగోలులోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్, ఎస్పీ, జేసీల ఆధ్వర్యంలో మతసామరస్యంపై మీడియా సమావేశం ఏర్పాటు చేయగా.. పెద్ద సంఖ్యలో అక్కడికి వెళ్లిన జర్నలిస్టులు సింగరాయకొండ ఘటనలో పోలీసులు ఉద్దేశపూర్వకంగా కేసులు పెట్టారని కలెక్టర్‌కు వివరించారు. ముందస్తు నోటీసులు కూడా ఇవ్వకుండా అరెస్టులు చేశారని.. బెయిలు కూడా రాకుండా ప్రయత్నం చేశారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అలానే ఇంకా కొన్ని ఛానళ్లు, పత్రికల బ్యూరోలను కూడా అరెస్టులు చేస్తామని భయపెడుతున్నారని చెప్పారు.
పోలీసుల చర్యలతో గ్రామస్థాయిలో పనిచేస్తూ జీతాలు కూడా లేకుండా అవస్థలు పడుతున్న రిపోర్టర్లు మానసిక వేదనకు గురవుతున్నామని జర్నలిస్ట్‌లు కలెక్టర్‌కు తెలియజేశారు. కేసులు పరిస్కారం అయ్యేవరకు జిల్లాలో పోలీసు విభాగం వార్తలు బహిష్కరిస్తామని వారు హెచ్చరించారు. జిల్లా పాలనాధికారిగా మీకు సహకరిస్తామని.. ఎస్పీ ఉన్నందున ఈ మీడియా సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు తేల్చి చెప్పారు. జిల్లా పాలనాధికారిగా న్యాయం చేయాలని జర్నలిస్టులు కలెక్టర్‌ను కోరారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలో నినాదాలు చేశారు. నిరసనగా జిల్లా పోలీసు విభాగం వాట్సాప్ గ్రూపు నుంచి జర్నలిస్టులు వైదొలిగారు.