వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం కింద మగ్గం ఉన్న చేనేత కార్మికులకు గత ఏడాది రూ.24 వేల చొప్పున నగదును వారి బ్యాంకు ఖాతాలకు ప్రభుత్వం నేరుగా జమ చేసింది. అయితే... లబ్ధిదారుల ఎంపికలో లోపాలున్నాయని... మగ్గాలు లేని చాలామందికి పథకాన్ని వర్తింపజేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పథకాన్ని పారదర్శకంగా అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా ప్రతి లబ్ధిదారుతో పాటు మగ్గాన్ని జియో ట్యాగింగ్ చేయాలని నిర్ణయించారు. తద్వారా బోగస్‌కు అవకాశం ఉండదని భావిస్తున్నారు.
జియో ట్యాగింగ్ ఇలా...
జిల్లా వరకు చీరాలలో చేనేత కార్మికులు అధికంగా ఉన్నారు. చీమకుర్తి, వలపర్ల, ఈతముక్కల, కనిగిరి, కందుకూరు ప్రాంతాల్లోనూ వీరు ఉన్నారు. గత ఏడాది నేతన్న నేస్తం కింద 7,184 మందికి ప్రభుత్వం సాయం అందజేసింది. ఈ ఏడాది మరో 2,141 మంది అదనంగా దరఖాస్తు చేసుకున్నారు. పాత వారితో పాటు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఇప్పుడు జియో ట్యాగింగ్ చేయనున్నారు. గ్రామ సచివాలయ సిబ్బంది, వార్డు వాలంటీరు దరఖాస్తుదారు ఇంటికి వెళ్లి... మగ్గంతో పాటు చేనేత కార్మికుడిని జియో ట్యాగ్ చేస్తారు. ఆ వివరాలను సచివాలయ సంక్షేమాధికారి నవశకం పోర్టల్‌లో నమోదు చేస్తారు. అక్కడ నుంచి ఎంపీడీవో లాగిన్‌కు వివరాలు చేరతాయి. అనంతరం జిల్లా చేనేత సహాయ సంచాలకుల కార్యాలయం లాగిన్‌కి వెళ్తాయి. అర్హతను బట్టి లబ్ధిదారుని ఎంపిక పూర్తి అవుతుంది.