ప్రకాశం జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ ఆరుతడిపంటలకు సాగునీరు విడుదలచేసేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమౌతోంది. నాగార్జున సాగర్ నుంచి ప్రకాశం జిల్లాకు రావాల్సిన 52 టీఎంసీల నీటి విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నారు. నీటి లభ్యత, కృష్ణానదీ యాజమాన్య బోర్డు కేటాయింపుల ఆధారంగా 2021-22 సంవత్సరానికి.. సెప్టెంబర్ 1 నుంచి నీటిని విడుదల చేస్తారు. పూర్తిగా ఆరుతడి పంటలకోసం వారాబంది పద్దతిలో వచ్చే మార్చి నెలవరకూ నీటిని విడుదల చేయనున్నారు. ఈ సాగునీటితో జిల్లాలో ఉన్న 25 మండలాల పరిధిలోని 4.34 లక్షల ఎకరాల్లో పంటలకు నీరు అందనుంది.
గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని ఆయకట్టుతో పాటు తాగునీటి అవసరాలకు నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి 132 టీఎంసీల నీటి కేటాయింపు ఉంది. ఇందులో 52 టీఎంసీలు ప్రకాశం జిల్లాలోని ఆయకట్టు, తాగునీరు అవసరాలకు కేటాయించారు. అవసరాన్ని బట్టి వారబంది విధానంలో 9 రోజుల సరఫరా లేదా 6 రోజులు నిలుపుదల పద్దతిలో మేజర్లకు నీరు సరఫరా చేస్తారు. అయితే వరి పంటకు నీటి కేటాయింపులు లేకపోవడంపై రైతాంగాన్ని నిరుత్సాహానికి గురిచేస్తోంది.