Construction of villas in Ongole : ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలుకు కూతవేటు దూరంలో అధికార పార్టీ ప్రజా ప్రతినిధి, తన బంధువులు కలిపి సుమారు 800 కోట్ల రూపాయల విలువ గల భారీ వెంచర్ ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ఖరీదైన విల్లాలు నిర్మాణాలు చేపట్టి వ్యాపారం చేసేందుకు నానా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. శుభం జరుగుతుందని తొలుత తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణం ఇదే వెంచర్‌లో భారీగా నిర్వహించారు. దీంతో వెంచర్‌కు మంచి ప్రచారం వచ్చింది. ఇక వెంచర్‌లో మౌళిక సదుపాయాలు కల్పన విషయంలో కూడా అధికారాన్ని వినియోగించుకుంటున్నారు.
మంచినీటి కోసం పొలాల్లో బోర్ల తవ్వకాలు : వెంచర్‌లో విల్లాల నిర్మాణ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. అయితే ఇక్కడ భూగర్భ జలంలో లవణీయత ఎక్కువగా ఉండటం, ఉప్పు నీరు నిర్మాణాలకు అంత అనువుగా ఉండకపోవడం వల్ల మంచినీటి కోసం పొలాల్లో బోర్ల తవ్వకాలు ప్రారంభించారు. వెంచర్‌కు సుమారు 8 కిలో మీటర్ల దూరంలో ఉన్న మంగళాధ్రి పురం సమీపంలో పొలాల్లో నుంచి డీప్ బోర్లు వేసి అందుకు అవసరమైన నీటిని తరలించేందుకు పైపు లైన్లు వేసుకుంటున్నారు. ఓ ప్రయివేట్ పొలాన్ని కొనుగోలు చేసి ఈ తంతు అంతా నిర్వహిస్తున్నారు. అయితే పొలాల్లో నీటిని డీప్ బోర్లు వేసి పెద్ద ఎత్తులో విల్లా అవసరాలకు తరలిస్తే సమీప పంట పొలాల్లో ఉన్న బోర్లు ఇంకిపోతాయని, భూగర్భ జలం తగ్గిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.