ప్రకాశం జిల్లాలో అనధికార విద్యుత్ కోతలు పరిశ్రమల యాజమాన్యాలకు చుక్కలు చూపిస్తున్నాయి . ప్రకాశం జిల్లా చీమకుర్తి పరిధిలో గురువారం పవర్‌హాలిడే అమలు సంగతి పక్కన పెడితే శుక్రవారం వారంతపు సెలవు. అదీ చాలదన్నట్లు..రోజుకు ఉదయం ఆరు గంటలనుంచి, సాయంత్రం ఆరు వరకూ సరఫరా చేస్తారు. అంటే వారానికి 5 రోజులు, 60 గంటలు మాత్రమే ఉత్పత్తికి అవకాశం. మిగిలిన సమయంలో....త్రీఫేజ్ విద్యుత్తు సరఫరా ఉండట్లేదని గ్రానైట్ కేంద్రాల యజమానులు అంటున్నారు.
చీమకుర్తి పరిధిలో దాదాపు 500 గ్రానైట్ పాలిషింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో యూనిట్‌లో ప్రత్యక్షంగా 15 నుంచి 20 మంది వివిధ రాష్ట్రాల కార్మికులు పనిచేస్తారు. యూనిట్ సామర్థ్యం ఆధారంగా రోజుకు సగటున 15 వందల నుంచి 3వేల చదరపు అడుగుల పలకలను ఉత్పత్తి చేస్తారు. ఈ లెక్కన నెలకు 30వేల నుంచి లక్షల చదరపు అడుగుల వరకూ సిద్ధమవుతాయి. ఇప్పుడీ విద్యుత్ కోతల వల్ల నెలవారి లెక్కలేస్తే...10 వేల నుంచి 30 వేల చదరపు అడుగుల పలకుల తయారీయే గగనమైపోయింది.