ప్రకాశం జిల్లాలో ఇప్పటివరకూ కరోనా పాజిటివ్ కేసులు 11 నమోదు కావడం జిల్లా ప్రజలను కలవరపెడుతోంది. లండన్ నుంచి వచ్చిన యువకుడికి కరోనా సోకటంతో జిల్లాలో తొలి కేసు నమోదు కాగా... మిగిలిన 10 కేసులూ దిల్లీ మత సమ్మేళానికి ముడిపడి ఉన్నాయి. చీరాలకి చెందిన మత పెద్ద వీరందరినీ దిల్లీ తీసుకువెళ్లారు. మతపెద్దతో పాటు అతడి భార్యకూ కరోనా పాజిటివ్ రావటంతో అంతా ఉలిక్కి పడ్డారు. మత పెద్దని కలిసిన వారందరినీ అధికారులు గుర్తించే పనిలో పడ్డారు. ఆయన కుటుంబ సభ్యులను ఐసొలేషన్ కేంద్రానికి తరలించారు. ఒంగోలులో ఉంటున్న మత పెద్ద కుమారుడికి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ రావటంతో మూడో తరం కేసు ఇక్కడ ప్రారంభమైంది.
యంత్రాంగం అప్రమత్తం
దిల్లీలో మత ప్రార్థనకు వెళ్లిన కందుకూరుకు చెందిన ముగ్గురుకి కరోనా పాజిటివ్ రావడం స్థానిక ప్రజలను కలవరపాటుకు గురిచేసింది. 300 మీటర్ల దూరాన్ని రెడ్‌జోన్‌గా గుర్తించిన అధికారులు....రాకపోకలను పూర్తిగా ఆపేశారు. 3 కిలోమీటర్ల వరకూ పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరం చేశారు. చీరాలలో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చింది. కారంచేడు మండలం కుంకలమర్రు గ్రామానికి చెందిన ఒకరు, కనిగిరికి చెందిన మరో వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. మొత్తంమీద మంగళవారం ఒక్కరోజే జిల్లాలో 8 కేసులు నమోదవటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రత్యేక అధికారి ఉదయలక్ష్మి ఒంగోలులో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. పాజిటివ్ కేసులు వచ్చిన ప్రాంతాల్లో నిత్యవసరాలు, రేషన్ ఇంటికి పంపించే కార్యక్రమం చేపడుతున్నారు.