కరోనా కాటు - అధిక ధరలతో జనంపై భారం
కరోనా ధాటికి ప్రజల జీవనవిధానం చిన్నాభిన్నమైంది. ఎంతో మంది ఉద్యోగాలు పోయి.. పూటగడవని పరిస్థితులు తలెత్తాయి. నిత్యావసరాలతోపాటు కూరగాయల ధరలు సామాన్యుడి నడ్డి విరిచే విధంగా ఉన్నాయి. టమోట, ఉల్లిపాయ, బంగాళ దుంపల రేట్లు పెరిగిపోగా.. కిలో కొనుగోలు చేసే చోట అరకిలో తీసుకుంటున్నామని వినియోగదారులు పేర్కొంటున్నారు. వెల చూసి బెదిరిపోవాల్సిన పని లేదని నిపుణులు భరోసా ఇస్తున్నారు. తక్కువ ధరలోనూ పోషకాలు ఎక్కువగా లభించే సీజనల్ కూరగాయలను విరివిగా తీసుకోవచ్చని సూచిస్తున్నారు.
ఆదాయం కోత...పోషకాల వేట
2001 జనాభా లెక్కల ప్రకారం.. ప్రకాశం జిల్లాలో 8.60 లక్షల కుటుంబాలు ఉన్నాయి. టమోట, ఉల్లిపాయలు, బంగాళ దంప, క్యారెట్ మొదలగు పంటలు.. మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు నుంచి దిగుమతయ్యేవి. ఏడాదికేడాది స్థానికంగా కూరగాయల సాగు, ఇతర రాష్ట్రాల నుంచి ఉత్పత్తి తగ్గడంతో ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. గత ఆరు నెలల్లోనే కూరగాయల ధరలు దారుణంగా పెరిగాయి. వ్యాపారాలు నిలిచిపోయి, పనులు లేక అనేక మందికి ఆదాయంలో కోత పడింది. రోగనిరోధకశక్తిని పెంచుకుంటేనే కరోనా నుంచి తప్పించుకోవచ్చంటూ చాలామంది పోషకాహారానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. రోజువారీ ఖర్చులపై నియంత్రణ లేక అప్పులు చేసి మరి వాడేస్తున్నారు.
మార్చి-అక్టోబర్ మధ్య ధరల వ్యత్యాసం | ||
కూరగాయలు | మార్చి-2020 | అక్టోబర్-2020 |
టమోట | 15 | 38 |
బీరకాయ | 30 | 45 |
వంకాయ | 28 | 40 |
బంగాళదుంప | 30 | 45 |
దొండకాయ | 25 | 45 |
మిర్చి | 30 | 55 |
ఉల్లిపాయ | 18 | 50 |
క్యారెట్ | 50 | 80 |
కాకర | 30 | 50 |
బెండ | 30 | 45 |