ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో ఇసుక అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు భూములన్న తేడా లేకుండా ఇసుక రవాణా సాగిస్తున్నారు. కడవకుదురు, పందిళ్లపల్లి, దేశాయిపేట, వేటపాలెం, ఈపురూపాలెం ప్రాంతాల్లో రైల్వే ట్రాక్ సమీపంలోనే ఈ దందా చేస్తున్నారు. ఈ కారణంగా ట్రాక్ కుంగిపోయే ప్రమాదంతో, పాటు భూగర్భ జలాలకు ముప్పుతప్పదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చీరాలలో యథేచ్ఛగా ఇసుక అక్రమ తవ్వకాలు - Illegal sand excavations in chirala
ప్రకాశం జిల్లా చీరాలలో ఇసుక అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతోంది. ఇవి బహిరంగంగానే జరుగుతున్నా.. పట్టించుకునే వారు కరవయ్యారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పండిళ్లపల్లిలో రైల్వే ట్రాక్‌ను అనుకుని 10 అడుగులకు ఇసుక తవ్వేసి అక్రమార్కులు సొమ్ము చేసుకున్నారు. ఈ ప్రాంతం సమీపంలో తనకు వారసత్వంగా వచ్చిన పొలం నుండి ఓ వ్యక్తి అక్రమంగా ఇసుకతవ్వి ధనం ఆర్జిస్తున్నారు. దీనిపై తిరుమల సాంబయ్య అనే వ్యక్తి ఈ నెల 4వ తేదీన ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఎస్పీ అదేరోజున చీరాల గ్రామీణ సీఐకి ఫిర్యాదు పంపారు. ఇరవై రోజులు అవుతున్నా.. ఇప్పటివరకు ఎలాంటి చర్యలు లేవు. ఈ విషయంపై తాను మెడికల్ లీవ్‌లో ఉండి.. మూడురోజుల క్రితమే విధుల్లో చేరానని సీఐ తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు.
ఇదీ చదవండీ..సాంకేతిక విద్యాభివృద్ధికి అనంతపురం జేఎన్టీయూ కృషి భేష్: గవర్నర్