ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం వల్లూరు గ్రామ చెరువులో... అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదు. చెరువులో యంత్రాలు పెట్టి గ్రావెల్‌ను అక్రమంగా రవాణా చేస్తున్నారు. చెరువుల్లో పూడికతీత పనులు చేసేటప్పుడు మాత్రమే తవ్వకాలు జరుపుతారు. దీనికి నీరు-చెట్టు, ఉపాధి హామీ పథకాల ద్వారా ఈ పనులు చేయంచి, కూలీలకు పని కల్పించేవారు. కానీ ఇక్కడ ఎటువంటి ప్రభుత్వ పథకం అమలు చేయకుండా, కొంతమంది అధికార పార్టీ నాయకుల అండదండలతోనే తవ్వకాలు చేపడుతున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
ప్రొక్లెయినర్లతో గ్రావెల్‌ను తవ్వి, టిప్పర్లతో రవాణా చేస్తున్నారు. రైల్వే మూడో లైన్ నిర్మాణ పనులకు ఈ గ్రావెల్‌ను తరలిస్తున్నారు. సుమారు 550 ఎకరాల విస్తీర్ణం గల చెరువుకు ఎగువ నుంచి వచ్చే నీరే ఆధారం. ఇప్పుడు ఈ చెరువుకు నీరు వచ్చే వాగుకు ఆనుకొని గ్రావెల్ తవ్వకాలు నిర్వహిస్తున్నారు.