తిరుపతి బర్ద్ వైద్యశాల ఆధ్వర్యంలో.. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ప్రజల నుంచి శిబిరానికి విశేష స్పందన లభించింది. వివిధ సమస్యలతో బాధపడుతున్న సుమారు 1,500 మంది రోగులు.. చికిత్స పొందేందుకు వైద్య శిబిరానికి వచ్చారు. తితిదే చైర్మన్ వై.వీ. సుబ్బారెడ్డి సహకారంతో.. స్థానిక టీటీడీ కళ్యాణ మండపం ఆవరణలో ఈ కార్యక్రం ఏర్పాటు చేశారు. మంత్రి ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యేలు నాగార్జునరెడ్డి, అన్నా రాంబాబులతో కలిసి.. ఆయన ఈ శిబిరాన్ని ప్రారంభించారు.
గుండ్లకమ్మ నది ఒడ్డున వెలసిన వెంకటేశ్వర స్వామి ఆలయంలో గుడికో గోమాత కార్యక్రమానికి తితిదే ఛైర్మన్ హాజరయ్యారు. ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం గోపూజ నిర్వహించి.. గుడికి ఆవును అందించారు. మార్కాపురంలో రహదారులపై తిరుగుతూ ఆవులు తరచూ ప్రమాదాలకు గురౌతున్నట్లు.. భారతి అనే సామాజిక కార్యకర్త ఆయన దృష్టికి తీసుకొచ్చింది. వెంటనే స్పందించిన సుబ్బారెడ్డి.. ఆవుల యజమానులతో మాట్లాడాలని స్థానిక ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి, మున్సిపల్ చైర్మన్ బాలమురళీకృష్ణను ఆదేశించారు. వారు స్పందించని ఎడల అన్నిటినీ గోశాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.