ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అకాల వర్షాలు.. పంటల నష్టం విలువ రూ.2 కోట్లు - prakasam district latest news

చీమకుర్తి మండలం పాటిమీదపాలెంలో అకాల వర్షం కారణంగా రూ. 2 కోట్లు మేర పంట నష్టం సంభవించిందని వ్యవసాయ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. మిర్చి, వరి, బొప్పాయి, అరటి తోటలు పండించిన రైతులకు ఇటీవల కురిసిన అకాల వర్షం కన్నీరు మిగిల్చింది. రైతు వారీగా నష్టాన్ని అంచనా వేసేందుకు బృందాలను నియమిస్తామని ఉద్యాన శాఖ డిప్యూటి డైరెక్టర్​ రవీంద్రబాబు తెలిపారు.

huge crop loss in prakasam district
వర్షానికి తడిచిపోయిన వరి ఓదెలు

By

Published : Apr 11, 2020, 2:24 PM IST

జిల్లాలో గురువారం ఈదురుగాలులతో కురిసిన అకాల వర్షం రైతన్నలకు నష్టాలను మిగిల్చింది. ఒక్కసారిగా వర్షం కురవగా.. పొలాల్లో ఉన్న మిర్చి, వరి పంటలను కాపాడుకోలేకపోయారు. పశ్చిమ ప్రాంత మండలాల్లో బొప్పాయి, అరటి తోటలు ధ్వంసమయ్యాయి. సంతనూతలపాడు, చీమకుర్తి ప్రాంతాల్లో బోర్ల కింద వరి వేయగా కోతలు కోసి ఓదెలు వేశారు. వర్షానికి పంట దెబ్బతినగా సుమారు రూ.70 లక్షల నష్టం ఉంటుందని వ్యవసాయ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.

245 హెక్టాల్లో వరి పాక్షికంగా దెబ్బతిందని జేడీఏ పీవీ శ్రీరామమూర్తి తెలిపారు. మార్టూరు ప్రాంతంలో మొక్కజొన్న చేతికొచ్చే దశలో ఉన్నప్పటికీ అక్కడ వర్షం తక్కువ కావడంవల్ల నష్టం ఉండదని చెప్పారు. ఈ పంటలన్నీ ఈ-క్రాప్‌లో నమోదైనందున బీమా వర్తిస్తుందన్నారు. వరికి కోత అనంతరం కూడా బీమా వర్తిస్తుందని, కొత్తపట్నంలో ఆలస్యంగా సాగు చేసిన శనగ పంటకు నష్టం వాటిల్లిందని వివరించారు.

ఉద్యాన పంటలకూ...

గిద్దలూరు, కొమరోలు ప్రాంతాల్లో 10.20 హెక్టార్లలో అరటి, గిద్దలూరు మండలంలో 1.20 హెక్టార్లలో బొప్పాయి, లింగసముద్రం, వలేటివారిపాలెం మండలాల్లో 40 హెక్టార్లలో మిర్చి పంట దెబ్బతినింది. సింగరాయకొండ, టంగుటూరు, కురిచేడు ప్రాంతాల్లో కళ్లాల మీద ఎండబెట్టిన 850 క్వింటాళ్లు మిర్చి తడిచిపోయినట్లు గుర్తించారు. మొత్తం మీద ఉద్యానశాఖ పరిధిలోని తోటలు, పంటలకు కలిపి రూ.1.31 కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు.

ఈ విషయంపై ఉద్యాన శాఖ డిప్యూటీి డైరెక్టర్‌ రవీంద్రబాబు స్పందించారు. తోటలకు బీమా చేయించిన వారికి పరిహారం తప్పకుండా వస్తుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వ పరంగా ఇన్‌పుట్‌ రాయితీ చెల్లింపునకు కలెక్టర్‌ ద్వారా ప్రతిపాదనలు పంపుతామని తెలిపారు. రైతుల వారీగా నష్టం అంచనాకు బృందాలను నియమిస్తామని చెప్పారు. పంట నష్టంపై అధికారులు నివేదిక ఇవ్వగానే.. ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు.

ఇదీ చదవండి:

'ఉద్యానవన పంటలకు గిట్టుబాటు దక్కేలా చర్యలు'

ABOUT THE AUTHOR

...view details