లాక్డౌన్ కారణంగా ఆర్థికంగా పర్యాటక రంగం కుదేలయ్యింది. పర్యాటక స్థలాలు మూసివేయడం, హోటళ్లు, రెస్టారెంట్లు మూసివేతతో ఉపాధి లేక యజమానులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దేశవ్యాప్త అన్లాక్ 1.0లో భాగంగా ప్రభుత్వం... కొన్ని సడలింపులతో.. తగు జాగ్రత్తలు తీసుకొని నిర్వహించుకోవచ్చని అనుమతిచ్చింది. ఈ ఆదేశాలతో హోటళ్లు, రెస్టారెంట్లు తెరుచుకున్నాయి.
ప్రకాశం జిల్లా ఒంగోలులో హోటళ్లు.. తమ ఉద్యోగులు, పర్యాటకుల కోసం భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేశాయి. వంటగదిలో మాస్కులు, గ్లౌజులు తప్పనిసరిగా వేసుకుంటున్నారు. వినియోగదారులకు ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే గదులు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. ఆటోమేటిక్ శానిటైజర్లు, రూం స్ప్రేయర్లు, లగేజీ స్ప్రేయర్లతో గదులను శానిటైజ్ చేస్తున్నారు. లాక్డౌన్ కారణంగా వ్యాపారాలు దెబ్బతిన్నాయని.. ప్రస్తుతం ఇచ్చిన సడలింపులతో పునఃప్రారంభానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని రెస్టారెంట్ల యజమానులు చెబుతున్నారు.