Land occupation: కాదేదీ కబ్జాకు అనర్హం అన్నట్టు ఏకంగా కొండ భూములనే వారు ఆక్రమించేశారు. అధికార పార్టీ నేతల అండదండలతో వందల ఎకరాలు దున్ని పంటలు సాగు చేసుకుంటున్నారు. దీంతో పశువుల మేతకూ స్థలం లేకుండా పోయింది. స్థానిక చెరువులకు నీళ్లు రాని పరిస్థితి ఏర్పడింది. ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలంలో పరిస్థితి ఇది. మండలంలోని పెదారికట్ల, చినారికట్ల రెవెన్యూ పరిధిలో కొండ భూములున్నాయి. ఈ భూములకు 2 కి.మీ.దూరంలో జాతీయ రహదారి, 50 మీటర్ల దూరంలోనే రైల్వే స్టేషన్ ఉన్నాయి. దీంతో ఒక్కసారిగా విలువ పెరిగింది.
అధికార పార్టీ నాయకుల అండ చూసుకుని కొందరు భూకబ్జాకు పాల్పడ్డారు. చినారికట్లలోని సర్వేనంబరు 501లో 461 ఎకరాల భూమి ఉండగా అందులో దాదాపు 300 ఎకరాలు, పెదారికట్లలోని సర్వేనంబరు 686లో 600 ఎకరాలకు 400 ఎకరాలు ఆక్రమించి చదును చేసి గతేడాది కంది, మినుము సాగు చేశారు. అత్యధిక భూమి అధికార పార్టీ మద్దతుదారుల ఆధీనంలోనే ఉంది. నేతలకు భయపడి అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడంతో పంట కాలం పూర్తయింది. మళ్లీ ఖరీఫ్ సాగుకు సన్నద్ధమవుతున్నారు. ఈ భూములకు ఏదోలా పాసు పుస్తకాలు సంపాదించి సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.