ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలు పట్టణంలోని రాజీవ్ నగర్, నిర్మల్ నగర్, అంజయ్య రోడ్డు, వీఐపీ రోడ్డు.. తదితర ప్రాంతాల్లో వేలాది ప్రజలు జీవిస్తున్నారు. వ్యాపార సంస్థలు, రాజకీయ ప్రముఖలు, పారిశ్రామిక వేత్తలకు ఈ ప్రాంతంలోనే శాశ్వత నిర్మాణాలు ఉన్నాయి. ఇలాంటి జనావాసాల మధ్య ఓ హైటెన్షన్ విద్యుత్తు లైన్ ప్రజలను నిత్యం భయాందోళనకు గురిచేస్తోంది.
దాదాపు 3 దశాబ్దాల క్రితం ఒంగోలు పట్టణంలో 132కేవీ హైటెన్షన్ విద్యుత్తు లైన్ ఏర్పాటు చేశారు. మంగమూరు రోడ్డు సబ్ స్టేషన్ నుంచి కర్నూల్ రోడ్డు సబ్ స్టేషన్ వరకూ 2.5 కిలోమీటర్ల మేర విద్యుత్తు టవర్లు వేసి లైన్ ఏర్పాటు చేశారు. అప్పట్లో ఈ లైన్‌కు ఎలాంటి ఇబ్బంది ఏర్పడలేదు. పట్టణం అభివృద్ధి చెందుతున్నందున ఈ హైటెన్షన్ లైన్ ఉన్న ప్రాంతం నివాసాల మధ్యకు వచ్చినట్లు అయ్యింది. విద్యుత్తులైను దగ్గరగా, దిగువున ఉన్నందున ఇళ్లపై అంతస్తులు వేసుకోడానికి వీలు ఉండటం లేదు. కనీసం మేడ మీదకు వెళ్లి బట్టలు ఆరబెట్టుకోడానికీ స్థానికులు వణికిపోతున్నారు.