ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం అప్పటి తహసీల్దార్ టి. చిరంజీవి 2010 ఫిబ్రవరి 20న అధికార దుర్వినియోగానికి పాల్పడి.. బోగస్ పట్టాలు ఇచ్చిన ఘటనపై వివరణ ఇచ్చేందుకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఉషారాణి హైకోర్టుకు హాజరయ్యారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన ధర్మాసనం.. మిగిలిన ప్రతివాదులైన ప్రధాన కార్యదర్శి, భూ పరిపాలన ప్రధాన కమిషనర్, ప్రకాశం జిల్లా కలెక్టర్, ఒంగోలు ఆర్డీవో ప్రమాణ పత్రాలు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను నెల రోజులకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేకే మహేశ్వరి, జస్టిస్ శ్యాంప్రసాద్తో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
ఫిర్యాదు చేసినా ఫలితం లేదు
బోగస్ పట్టాల ఘటనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని నర్సింహారావు అనే వ్యక్తి 2011లో హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి ప్రమాణ పత్రం దాఖలు చేయనందుకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిపై గత విచారణలో ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే పిటిషనర్ ఆరోపిస్తోన్న భూములు గతంలో నాగార్జున వర్శిటీకి కేటాయించారని.. తర్వాత వెనక్కి తీసుకున్నారని అదనపు అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. ఆ భూములను ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వలేదన్నారు. ఆ వివరాల్ని పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం ప్రమాణ పత్రాలు దాఖలుకు ఆదేశించింది. తదుపరి విచారణకు ముఖ్య కార్యదర్శికి హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది.
ఇదీ చూడండి:
'అదే జరిగితే... సగం ఏపీ కనిపించదు'