ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Zindal Steel Andhra Petition: ‘జిందాల్‌ స్టీల్‌’ టెక్నికల్‌ బిడ్‌ దస్త్రాలను స్వీకరించండి..:హైకోర్టు - ap high court

High Court on Zindal Steel Petition: జిందాల్​ స్టీల్​ ఆంధ్రా లిమిటెడ్​ సంస్థ సమర్పించే టెక్నికల్‌ బిడ్‌ ఒరిజినల్‌ దస్త్రాలను స్వీకరించాలని రాష్ట్ర గనులశాఖ అధికారులను(నోడల్‌) హైకోర్టు ఆదేశించింది. దస్త్రాలు స్వీకరించినట్లు తిరుగు రశీదు ఇవ్వాలని స్పష్టం చేసింది. ఇతరులు సమర్పించిన బిడ్లతో పాటు జేఎస్‌ఏఎల్‌ సమర్పించిన బిడ్‌లను పరిగణనలోకి తీసుకోవాలని తేల్చిచెప్పింది.

High Court on Zindal Steel Petition
High Court on Zindal Steel Petition

By

Published : Jun 24, 2023, 11:32 AM IST

High Court on Zindal Steel Petition: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అద్దంకివారిపాలెం, మరో రెండు ఇనుప ఖనిజ క్షేత్రాల్లో ఖనిజాన్వేషణ, లీజుల మంజూరుకు సంబంధించిన టెండర్‌ విషయంలో జిందాల్‌ స్టీల్‌ ఆంధ్రా లిమిటెడ్‌(జేఎస్‌ఏఎల్‌) సంస్థ సమర్పించే టెక్నికల్‌ బిడ్‌ ఒరిజినల్‌ దస్త్రాలను స్వీకరించాలని రాష్ట్ర గనులశాఖ అధికారులను(నోడల్‌) హైకోర్టు ఆదేశించింది. దస్త్రాలు స్వీకరించినట్లు తిరుగు రశీదు ఇవ్వాలని స్పష్టం చేసింది. ఇతరులు సమర్పించిన బిడ్లతో పాటు జేఎస్‌ఏఎల్‌ సమర్పించిన బిడ్‌లను పరిగణనలోకి తీసుకోవాలని తేల్చిచెప్పింది.

మరోవైపు ఈ నెల 19న ఒరిజినల్‌ బిడ్‌ దస్త్రాలను సమర్పించేందుకు కార్యాలయానికి వెళ్లినప్పటికీ పలు కారణాలు చెప్పి తీసుకోవడానికి అధికారులు నిరాకరించారని జేఎస్‌ఏఎల్‌ చెబుతున్న నేపథ్యంలో ఆరోజుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్​ను భద్రపరిచి దానిని కోర్టు ముందు ఉంచాలని గనులశాఖ డైరెక్టర్, కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని గనులశాఖ డిప్యూటీ డైరెక్టర్, విజయవాడ పోరంకిలోని ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ కార్యాలయ గనులశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ను ఆదేశించింది. వారికి నోటీసులు జారీచేస్తూ పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచాలని పేర్కొంది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.సుబ్బారెడ్డి ఈమేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చారు.

ప్రకాశం జిల్లాలోని అద్దంకివారిపాలెం, లక్ష్మక్కపల్లి, ఉత్తర, దక్షిణ క్షేత్రాల్లో ఖనిజాన్వేషణ, లైసెన్స్‌ జారీ కోసం గనులశాఖ టెండర్‌ పిలిచింది. ఈ నెల 19వ తేదీన టెక్నికల్‌ బిడ్‌లను ఎలక్ట్రానికల్‌ ఫారం రూపంలో సమర్పించడమే కాకుండా చేతి ద్వారా బిడ్‌ ఒరిజినల్‌ దస్త్రాలను కార్యాలయంలో సమర్పించాలని పేర్కొంది. తమ ఒరిజినల్‌ దస్త్రాలను గనులశాఖ కార్యాలయంలో 19వ తేదీన అందజేయడానికి వెళ్లగా పలు సాకులు చూపుతూ వాటిని తీసుకోవడానికి అధికారులు నిరాకరించారని పేర్కొంటూ జేఎస్‌ఏఎల్‌ డైరెక్టర్‌ నంద కిశోర్‌ శర్మ హైకోర్టులో మూడు వ్యాజ్యాలు దాఖలు చేశారు. సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌.. పిటిషనర్‌ తరఫున వాదనలు వినిపించారు.

టెక్నికల్‌ బిడ్‌ ఒరిజినల్‌ దస్త్రాలను కార్యాలయంలో అందజేయడానికి వెళ్లగా వాటిని స్వీకరించేందుకు తమకు అధికారం లేదనే కారణం చూపుతూ నోడల్‌ అధికారి తిరస్కరించారన్నారు. ఫోన్‌ కాల్, మెసేజ్​ ద్వారా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి దస్త్రాలు స్వీకరించాలని కోరినా ఫలితం లేదన్నారు. ఉద్దేశ పూర్వకంగా వాటిని అంగీకరించలేదన్నారు. 19వ తేదీనాటి సీసీటీవీ ఫుటేజ్‌ను తెప్పించి పరిశీలించాలని కోరారు. హడావుడిగా టెక్నికల్‌ బిడ్‌ను తెరిచే ప్రమాదం ఉందన్నారు. తమ దస్త్రాలను స్వీకరించేలా అధికారులను ఆదేశించాలని కోరారు.

తమకు అందిన బిడ్‌లను పరిగణనలోకి తీసుకుంటామని గనులశాఖ తరపు న్యాయవాది నవీన్ వాదించారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. పిటిషనర్‌ సంస్థ ఇప్పటికే ఈ-బిడ్‌ అప్‌లోడ్‌ చేసిందని గుర్తు చేశారు. ఒరిజినల్‌ దస్త్రాలను కార్యాలయంలో అందజేయడానికి పిటిషనర్‌ సంస్థ అన్ని ప్రయత్నాలు చేసిందన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 23, 24 తేదీల్లో జేఎస్‌ఏఎల్‌ సంస్థ అందజేయబోయే టెక్నికల్‌ బిడ్‌ ఒరిజినల్‌ దస్త్రాలను స్వీకరించాల్సిందేనని తేల్చిచెప్పారు. 19వ తేదీనాటి సీసీటీవీ ఫుటేజ్‌ను కోర్టుకు సమర్పించాలని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details