Helicon birds dying in tekkali: రెక్కల రెపరెపలతో రివ్వున సాగుతూ.. కిలకిలారావాలతో కేరింతలు కొడుతూ... సందడి చేసే విదేశీ విహంగాలు ఒక్కొక్కటిగా నేల రాలుతున్నాయి. టెక్కలి సమీపంలోని తేలినీలాపురం విదేశీపక్షుల విడిది కేంద్రంలో వలస పక్షుల మృత్యుఘోష బుధవారం రోజు కూడా కొనసాగింది. రోజుకు పదుల సంఖ్యలో పక్షులు మృతిచెందుతుండగా, గ్రామస్థులు వాటిని దూరంగా తరలించి పూడ్చిపెడుతున్నారు.
పెలికాన్‌కే ఎందుకు ప్రమాదం..
సంతానోత్పత్తి కోసం సైబీరియా నుంచి పెలికాన్, పెయింటెడ్ స్టార్క్ పక్షులు వస్తుంటాయి. వాటిలో పెలికాన్ పక్షులే రోజూ ప్రాణాలు విడుస్తున్నాయి. దీనికి కారణాలు వీలయినంత త్వరగా కనుగొని మిగిలిన వాటినైనా కాపాడాలని గ్రామస్థులు కోరుతున్నారు.
కారణాలు కనుక్కోలేక..
రెండు వారాలుగా వందకుపైగా పెలికాన్ పక్షులు మృత్యువాతపడ్డాయి.. అధికారులు మాత్రం ఇంతవరకు కారణం తెలుసుకోలేకపోతున్నారు. ఆ దిశగా చేస్తున్న ప్రయత్నాలూ అంతంతమాత్రమే.. అటవీశాఖ ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించినప్పటికీ సమస్య ఏంటన్నది స్పష్టంగా చెప్పలేకపోయారంటున్నారు. పెలికాన్(గూడబాతు) జాతికి చెందిన పక్షులు బాతుల వలే చెరువులు, సమీప తంపర ప్రాంతాల్లోని లోతైన ప్రదేశాల్లో ఈదుతూ వెళ్లి పెద్దచేపల వేటసాగిస్తాయి. ఇవి జబ్బున పడిన చేపల్ని తింటున్నాయా లేక రసాయనాలు కలసిన నీటివనరుల్లో వేటసాగిస్తూ ప్రభావానికి లోనవుతున్నాయా.. అన్నదానిపైనా స్పష్టత లేదు. ఇన్నేళ్లలో ఇటువంటి దారుణం ఎన్నడూ చూడలేదంటూ తేలినీలాపురం గ్రామస్థులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. కిందపడిన పక్షులకు వైద్యసేవలు అందించకపోవడంతో అవి తమ కళ్లెదుటే మృతిచెందుతుండటం ఆ పర్యావరణ ప్రేమికులను కలచివేస్తోంది.
మందులు అందించేందుకు ప్రయత్నిస్తున్నాం
విదేశీపక్షులు అంతుచిక్కని కారణాలతో మృతిచెందుతున్నాయి. శ్రీకాకుళంలోని యానిమల్ డిసీజ్డ్ డయాగ్నస్టిక్ సెంటర్ ఏడీ సూచనలతో పక్షులకు రెండు రకాల మందులు అందజేయనున్నాం. వీటిని తక్షణమే స్థానికంగా అందుబాటులో ఉంచుతాం. కిందపడి అస్వస్థతకు గురైన పక్షులను గుర్తించి వెంటనే ఈ మందులు వేసి బతికించే ప్రయత్నం చేస్తాం.- పీవీ శాస్త్రి, అటవీశాఖ రేంజర్, టెక్కలి
ఇదీ చదవండి:bopparaju: ఇక్కడికన్నా.. తెలంగాణలోనే ఎక్కువ : బొప్పరాజు