కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే ప్రకాశం జిల్లాలో తొలివిడతలో దాదాపు 24 వేల మందికి అందించేందుకు జిల్లా అధికారులు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. తొలివిడత వ్యాక్సిన్ లో కోవిడ్ బాధితులకు సేవలందిస్తున్న వైద్య సిబ్బంది, అంగన్‌వాడి కార్యకర్తలకే అవకాశం ఉంటుంది. జిల్లాలో ప్రభుత్వం వైద్య కేంద్రాలు 370, ప్రయివేట్ వైద్య కేంద్రాలు 128 వరకూ ఉన్నాయి. ఇందులో పనిచేసేవారికి తొలి ప్రాధాన్యం ఉంటుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన పేర్లు నమోదు ప్రక్రియ పూర్తయ్యింది.
వ్యాక్సిన్ ఎక్కడ వేయించుకోవాలో చరవాణికి సమాచారం అందిస్తారు. భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొవిడ్ యాప్‌లో వీరి వివరాలు అప్‌లోడ్ చేస్తారు. వ్యాక్సిన్ వస్తే ఎలా పనిచేయాలనే విషయంపై వైద్య సిబ్బందికి ఇప్పటికే పలుమార్లు శిక్షణా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఏ వ్యాక్సిన్ వస్తుంది...? ఎప్పుడొస్తుంది..? డోసు ఎంతవ్వాల్సి ఉంటుందనే విషయంపై స్పష్టత రానప్పటికీ, ఎప్పుడు వచ్చినా సిద్దంగా ఉండాలనే ఉద్దేశ్యంతో వైద్యశాఖ అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.
జిల్లా కేంద్రంలో ఇమ్యూనైజేషన్ అధికారి కార్యాలయం వద్ద ఉన్న కోల్డ్ చైన్ కాంప్లెక్స్‌లో వ్యాక్సిన్ నిల్వ చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. 2నుంచి 8 డిగ్రీ ఉష్ణోగ్రత రిఫ్రిజరేటర్లలో వ్యాక్సిన్‌ను భద్రపరుస్తారు. కోల్డ్ చైన్ కాంప్లెక్స్‌లో వ్యాక్సిన్‌ను, పక్కనే ఉన్న రెడ్ క్రాస్ నూతన భవనంలో ఇతర సామగ్రి వంటివి నిల్వ చేసే విధంగా అధికారుల సిద్దం చేస్తున్నారు. ఇక్కడ నుంచి ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు సరఫరా చేస్తారు. ఇందుకోసం డి.ఐ.ఒ. వద్ద రెండు రిఫ్రజరేటెడ్ వాహనాలు ఉన్నాయి.