పోలీసుశాఖలో తపాలా ఓట్లు కలకలం రేపాయి. గత ఎన్నికల్లో కొందరు సిబ్బంది ఓ పార్టీకి కొమ్ముకాయడమే కాకుండా.. ఓట్లు వేయించామని చెప్పడం చర్చనీయాంశమైంది. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఉన్న 700 పైచిలుకు పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి తాము, పోలీసుశాఖలోని మరికొందరి సహకారంతో ఓటర్ల వివరాలను సేకరించి ఓ పార్టీకి ఇచ్చామని స్పెషల్ బ్రాంచి హెడ్ కానిస్టేబుల్ వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని లేపాయి. దీనిని తీవ్రంగా పరిగణించిన జిల్లా ఎస్పీ మలికా గార్గ్ అతడిని వేకెన్సీ రిజర్వుకు (వీఆర్) పంపుతూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.
సహకరించినా న్యాయం చేయడం లేదంటూ..:
పలు ప్రభుత్వ శాఖలకు చెందిన ఎంపిక చేసిన ఉద్యోగులతో గత నెల 30న ఒంగోలులో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గత ఎన్నికల్లో అధికార పార్టీకి సహకరించిన కొందరు అధికారులు, సిబ్బందినీ ఆహ్వానించారు. రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తనయుడు ప్రణీత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో హెడ్ కానిస్టేబుల్ నర్రా వెంకటరెడ్డి మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో తనతోపాటు మరో ఆరుగురు పోస్టల్ బ్యాలెట్లను సేకరించామని, తమ కృషికి మేలు చేసే పరిస్థితి కల్పించాలని కోరారు. గత ప్రభుత్వంలో ఉన్నవారే ఇప్పటికీ కీలక స్థానాల్లో ఉన్నారన్నారు. ఈ విషయాన్ని మంత్రి బాలినేని దృష్టికి పలుమార్లు తీసుకెళ్లామని, మీరైనా న్యాయం చేయాలని ప్రణీత్‌రెడ్డిని కోరారు. ఈ వీడియో వారం రోజుల తర్వాత సామాజిక మాధ్యమాల ద్వారా వెలుగులోకి వచ్చింది. తనతోపాటు మల్లారెడ్డి, కోటిరెడ్డి, సుబ్బారావు, వేణు, హోంగార్డు కిషోర్, ఒక మహిళా కానిస్టేబుల్ పేరును కూడా వెంకటరెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ సమావేశానికి ఎవరెవరు హాజరయ్యారు అనే కోణంలో పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు.
ఇదీ చదవండి:VIVEKA MURDER CASE: నేడూ ఆయుధాల కోసం వెతకాలని సీబీఐ నిర్ణయం