అక్కడ పారిశ్రామికవాడ ఏర్పాటై దశాబ్దాలు అవుతున్నా ఇంక మౌలిక వసతుల కల్పన ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారింది. ఇది ఎక్కడో మారుమూల ప్రాంతంలో అనుకుంటే పొరబడినట్లే.. ఒంగోలుకు కూతవేటు దూరంలో వేలాది మందికి ఉపాధి కల్పించే ఉద్దేశంతో ఏర్పాటైన గుండ్లాపల్లి గ్రోత్‌సెంటర్ దగ్గర.
ఇదీ నేపథ్యం..
మద్దిపాడు మండలం గుండ్లాపల్లి గ్రోత్‌సెంటర్ జాతీయ రహదారి పక్కన పారిశ్రామిక కేంద్రాన్ని పదిహేనేళ్ల క్రితం ప్రారంభించారు. ఈ కేంద్రం ఏర్పాటుకు పరిసర ప్రాంతాల రైతుల నుంచి 1470 ఎకరాల స్థలాన్ని తీసుకొని 1340 ఎకరాల్లో 650 ప్లాట్లు ఏర్పాటు చేశారు. మిగిలిన భూములను పచ్చదనం, వాటర్ ట్యాంకులు, ఆరోగ్యకేంద్రం, విద్యుత్‌కేంద్రం, శిక్షణా కేంద్రం, దేవాలయాలు, కార్మికులకు ఇళ్ల స్థలాలు, డంపింగ్‌యార్డు కోసం మిగిలిన స్థలాన్ని కేటాయించారు. కానీ అవేవీ పూర్తిస్థాయిలో ఆచరణలోకి రాలేదు. ఇప్పటివరకు ఆ ప్రాంతంలో దాదాపు 400 వరకు వివిధ కర్మాగారాలు ఏర్పాటు అయ్యాయి. మిగిలిన ప్లాట్లు ఖాళీగా, నిర్మాణ దశలోనే ఉన్నాయి. ఇక్కడి కర్మాగారాల్లో దాదాపు 10వేల మందికి పైగా ఉపాధి పొందుతున్నారు.
కొరవడిన వసతులు
నిరుద్యోగులకు ఉపాధిని కల్పించేందుకు 1.6 ఎకరాల్లో భవనాన్ని నిర్మించారు. అది నిరుపయోగంగా ఉంది. ఎవరైనా స్వచ్ఛంద సంస్థల నుంచి శిక్షణ ఇస్తామని వచ్చినా కిరాయి విషయంలో ఒప్పందం కుదరక అది ముందుకు సాగడంలేదు. పారిశ్రామిక కేంద్రానికి డంపింగ్‌యార్డు కోసం 20 ఎకరాల స్థలాన్ని కేటాయించినప్పటికీ అది వినియోగంలో లేదు. దీంతో రహదారుల పక్కనే వ్యర్థాలు పారబోస్తున్నారు. గ్రానైట్, రసాయన వ్యర్థాలు రహదారుల పక్కన ఉన్న సైడుకాలువలను నింపేశాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే రోడ్లు, ఖాళీగా ఉన్న స్థలాలు పూర్తిగా నిండిపోయి ఇబ్బందిగా మారింది. కొన్ని రసాయనిక వ్యర్థాలు నేరుగా గుండ్లకమ్మ జలాశయంలో కలుస్తున్నాయని, ఫలితంగా మంచినీరు పాడై అనారోగ్యాలకు గురవుతున్నామని స్థానికులు వాపోతున్నారు.
రహదారులపై ఒక్క విద్యుత్ దీపం కూడా లేకపోవడంతో రాత్రి సమయాల్లో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అని కార్మికులు భయపడున్నారు. పారిశుద్ధ్య పనుల్లో భాగంగా రహదారులు ఊడ్పిస్తున్నారే కానీ మురుగు కాలువల మరమ్మతులతో నీరు పోయే మార్గం చూపలేకపోయారు. దీంతో రహదారులు మురుగు, బురదమయంగా మారాయి. అక్కడ ప్రజలు, వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారింది.
నిధులున్నా పనులు శూన్యం