Gundlakamma Project Gate Washed Away in Maddipadu :ప్రభుత్వ నిర్లక్ష్యానికి కందుల ఓబిల్ రెడ్డి గుండ్లకమ్మ జలాశయం మరో సారి వార్తల్లోకెక్కింది. గత ఏడాదిలో జరిగిన నష్టానికైనా కళ్లు తెరవని ప్రభుత్వం మరో నష్టాన్ని చవిచూసింది.. రైతులకు కన్నీళ్లు మిగిల్చింది. మద్దిపాడు మండలం మల్లవరం వద్ద నిర్మించిన గుండ్లకమ్మ రిజర్వాయర్‌లో స్పిల్ వే రెగ్యులేటర్‌లో ఉన్న రెండోవ గేట్ శుక్రవారం రాత్రి 8గంటల ప్రాంతంలో కొట్టుకుపోయింది. గత ఏడాది ఆగస్టు 31 రాత్రి మూడో గేట్ ఇదే విధంగా కొట్టుకుపోయింది. అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, మంత్రులు సందర్శించి నెల రోజుల్లో కొత్త గేట్ ఏర్పాటు చేసి, రిజర్వాయర్ నిర్వహణకోసం నిధులు మంజూరుచేస్తామని, 15 గేట్లూ బాగు చేస్తామని ప్రగల్భాలు పలికారు. కానీ అవన్నీ నీటి మాటలయ్యాయి. 3వ గేట్‌ను మరమ్మతులు కూడా చేయలేని పరిస్థితి ఏర్పడింది.
Kandula Obula Reddy Gundlakamma Reservoir Project Situation :మిగ్‌జాం తుపానుకు (Michaung Cyclone) ముందు జలాశయంలో 1.3టీఎంసీలే ఉన్నాయి. తుపాను కారణంగా ఎగువ ప్రాంతం నుంచి ఇన్‌ఫ్లో ఎక్కువగా రావడంతో జలాశయంలోకి 2.5టీఎంసీల నీరు చేరింది. బుధవారం రాత్రి రెండు గేట్లు ఎత్తి కొంత మేర నీరు దిగువకు వదిలారు. ఉద్ధృతి తగ్గిందనుకొని తిరిగి మూసివేశారు. అప్పటికే తుప్ప పట్టిపోయి ఉన్న 5, 6 గేట్లు మాత్రం మార్చి కొత్తివి ఏర్పాటు చేశారు. మిగిలిన గేట్లు ఎప్పుడు కొట్టుకుపోతాయోనని సర్వత్రా భయాందోళనతో ఉన్నారు. అంతా భయపడినట్లే పైనుంచి ప్రవాహం ఎక్కువ కావడంతో మరమ్మతులకు నోచక తుప్పుపట్టి ఉన్న రెండో గేటులోని అడుగు భాగం కొంత శుక్రవారం రాత్రి కొట్టుకుపోయింది. నీళ్లన్నీ సముద్రంలోకి పోతున్నాయి.
ఏపీ గుండ్లకమ్మ ప్రాజెక్టులో విరిగిన రెండో గేట్
Gundlakamma Reservoir in Trouble :గేటు కొట్టుకుపోయిందని తెలిసి స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో అధికారులు విద్యుతు సరఫరా నిలిపివేశారు. వరద నీరు దిగువకు పెద్ద ఎత్తున వస్తుండటంతో పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ఆయా గ్రామాల్లో దండోరా వేయించారు. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.