APSRTC: ఆర్టీసీలో మెడికల్ అన్‌ఫిట్ అయిన సిబ్బంది కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో వారు ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నారు. వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలన్న జీవోను ఆర్టీసీ యాజమాన్యం అమలు చేయకపోవడంతో అవస్థలు పడుతున్నారు. కుటుంబ పోషణ భారంగా మారుతోందని ఆదుకోవాలని మెడికల్ అన్‌ఫిట్ అయిన సిబ్బంది వేడుకుంటున్నారు. ఆర్టీసీలో రాష్ట్రవ్యాప్తంగా 170 మంది మెడికల్ అన్‌ఫిట్ కారణంగా ఉద్యోగాలు వదులుకున్నారు. ఐదేళ్లపైన సర్వీస్ ఉన్నవారికి మెడికల్ గ్రౌండ్స్ క్రింద వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇచ్చే అవకాశం ఉంది.
అమలు కానీ జీవో..
ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీలో రాష్ట్ర వ్యాప్తంగా 170 మంది ఉద్యోగులు ఉన్నారు. ఐదేళ్లకు పైగా సర్వీస్ ఉన్నవారికి పీ.డీ. 19-2015 జీవో ప్రకారం మెడికల్ గ్రౌండ్స్ క్రింద వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇచ్చే అవకాశం ఉంది. సుప్రీం కోర్టు తీర్పు ఆధారంగా 2015లో ఈ ఉత్తర్వులు అప్పటి ఆర్టీసీ ఎండీ సాంబశివరావు జారీ చేశారు. విధులు నిర్వహించలేని వీరిలో తమ భార్యకో, పిల్లలకో ఉద్యోగం వస్తుందని, కుటుంబ పోషణకు ఇబ్బంది ఉండదని ఆశపడ్డారు.