ప్రకాశం జిల్లాలో ఉపాధ్యాయుల ధర్నా..
పదకొండవ పీఆర్సీని వెంటనే అమలు చేయాలని కోరుతూ ప్రకాశం జిల్లా కొరిసపాడు మండల కార్యాలయం ఎదుట యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు. 55 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ అమలు చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి హరిబాబు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చాలని అన్నారు. పీఆర్సీ కమిషన్ నియమించి ఇప్పటికి మూడు సంవత్సరాలు అయినా.. ఎలాంటి ప్రయోజనం లేదని వాపోయారు.
కర్నూలు జిల్లాలో...
కర్నూలు జిల్లా కోడుమూరు మండలంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ధర్నా చేపట్టారు. పదకొండవ పీఆర్సీని వెంటనే అమలు చేయాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లా యూటీఎఫ్ అధ్యక్షుడు ఎల్లప్ప మాట్లాడుతూ.. కొన్ని ఏళ్లుగా ఉద్యోగులకు పీఆర్సీ అమలు కావడం లేదని, 50 శాతం ఫిట్‌మెంట్‌తో పదకొండవ పీఆర్సీ వెంటనే అమలు చేయాలని అన్నారు.
కడప జిల్లాలో...
ముఖ్యమంత్రి ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుని 55 శాతం ఫిట్‌మెంట్‌తో 11వ పీఆర్సీని అమలు చేయాలని డిమాండు చేస్తూ కడప జిల్లా మైదుకూరులో ఉపాధ్యాయులు ధర్నా చేశారు. తహసీల్దార్, ఎంపీడీవోలకు వినతిపత్రాన్ని సమర్పించారు.
శ్రీకాకుళం జిల్లాలో...
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ధర్నా చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం పదకొండవ పీఆర్సీని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని యూటీఎఫ్ ప్రతినిధులు కోరారు.
కృష్ణాజిల్లాలో....
కమిటీలతో కాలయాపన చేయకుండా సీపీఎస్ విధానాన్ని రద్దుచేసి, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయ్ భాస్కర్ డిమాండ్ చేశారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశం మాట్లాడుతూ ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని.. తక్షణమే సమస్యలను పరిష్కరించాలన్నారు. జులై 1వతేదీ 2018 నుంచి 55% ఫిట్‌మెంట్‌తో 11వ పీఆర్సీని వెంటనే అమలుచేయాలన్నారు.
నెల్లూరు జిల్లాలో..
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయుల పట్ల అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని విడనాడి 11వ పీఆర్సీని 55 శాతం ఫిట్‌మెంట్‌తో అమలు చేయాలని నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ఉపాధ్యాయులు ధర్నా చేపట్టారు. ముఖ్యమంత్రి ప్రజా సంకల్ప యాత్రలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ ను రద్దు చేయాలని పేర్కొన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ ఉద్యమాలను అణచివేసే విధంగా ఇచ్చిన జీవోలను వెంటనే రద్దు చేయాలన్నారు. దశల వారీ ఉద్యమాల్లో భాగంగా ఈ నెల 30న జిల్లాస్థాయిలో వచ్చే నెల 5వ తేదీన రాష్ట్రస్థాయిలో ధర్నా కార్యక్రమాలు జరుగుతాయన్నారు. సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఎంపీడీవో, తహసీల్దార్‌కు అందజేశారు.
ఇదీ చదవండి: