బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి పేర్నినాని ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ గురవయ్య విధులు నిర్వహిస్తూ హఠాత్తుగా గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయారు. బాధను పంటి బిగువన భరిస్తూ బస్సును అదుపు చేసి రహదారి పక్కన నిలిపి... 78 మంది ప్రయాణికులను కాపాడాడు. మృత్యువు ఎదురుగా ఉన్న సమయంలోనూ వృత్తి ధర్మాన్ని పాటిస్తూ.. ఇంత మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన అతని మరణం అందరినీ కలచి వేసింది. ఈ విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లటంతో ప్రభుత్వం డ్రైవర్ కుటుంబానికి సహాయం అందించింది. రాష్ట్ర రోడ్లు రవాణా శాఖ మంత్రి పేర్ని నాని గురవయ్య కుటుంబాన్ని పరామర్శించారు. బాధిత కుటుంబానికి సర్కారు అన్ని విధాలా అండగా ఉంటుందని అన్నారు. ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు.
ఉపరాష్ట్రపతి సానుభూతి
78 మంది ప్రయాణికులను కాపాడి బస్సు సీటులోనే కుప్పకూలి చనిపోయిన డ్రైవర్ గురవయ్య త్యాగం మరువలేనిదని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సోమవారం ట్వీట్ చేశారు. బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.