కరోనా మహమ్మారితో పసిడి వ్యాపారం కుదేలయింది.. కొన్ని నెలలుగా దుకాణాలు మూసి ఉండటంతో కోట్లాది రూపాయల వ్యాపారం దెబ్బతిన్నదని బంగారు దుకాణాల యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. స్వర్ణకారులకు ఉపాధిలేక దయనీయంగా జీవితాలు వెల్లదీస్తున్నారు.
లాక్ డౌన్ ఎఫెక్ట్: కుదేలైన పసిడి వ్యాపారం
బంగారు నగలను అద్భుతంగా తయారుచేసి మగువల మనసుల్లో కాంతులను పంచే స్వర్ణకారులు లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. వారి వృత్తిపేరులో ఉన్న బంగారం జీవితంలో లేకుండా పోయింది.. ఒకప్పుడు పట్టిందల్లా బంగారం అనే వారి జీవితాలు కరోనా మహమ్మారి కారణంగా ఇబ్బందుల్లో పడ్డాయి. ప్రకాశం జిల్లా చీరాలలో స్వర్ణకళాకారుల పరిస్థితి దినదినగండంగా మారిందని విచారం వ్యక్తం చేస్తున్నారు.
ప్రకాశం జిల్లా చీరాలలో 80 దుకాణాలు ఉండగా వాటిపై 400 కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. కుల వృత్తిని నమ్ముకున్న వీరికి ప్రస్తుతం ఎటువంటి పని లేకపోవటంతో జీవనం దయనీయంగా మారింది.. దుకాణాలు అద్దెలు, విద్యుత్ బిల్లులు కట్టుకోలేని పరిస్దితి, మరోపక్క కుటుంబం గడవని స్దితిలో ఉన్నామని, ఇదేపరిస్దితి కొనసాగితే ఆత్మహత్యలే శరణ్యం అంటున్నారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని స్వర్ణకారులు కోరుతున్నారు.
ఇదీ చూడండి :రాజధానిగా అమరావతినే కొనసాగించాలి: అమరావతి పరిరక్షణ సమితి