ఆగస్టు 15న పేదలకు ఇళ్ల స్థల పట్టాలు పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. అనంతరం సదరు లబ్ధిదారులకు కొత్త గృహ నిర్మాణ పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చేందుకు ప్రణాళిక చేస్తోంది. దీంతో ఇప్పటికే నిర్మించుకున్న వారిలో... బిల్లు బకాయిలు విడుదలవుతాయో లేదోనన్న ఆందోళన నెలకొంది.
2016-17 నుంచి 2019-20 ఆర్థిక సంవత్సరం వరకు ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద ప్రకాశం జిల్లాకు 72,420 పక్కా గృహాలు కేటాయించారు. విడతల వారీగా 53,626 ఇళ్లకు పరిపాలన అనుమతి తీసుకున్నారు. వీటిలో ఇప్పటి వరకు 35,041 పూర్తయ్యాయి. 2016-17లో ఎన్టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణ పథకం కింద 3,006 ఇళ్లు మంజూరయ్యాయి. వీటిలో 1,475 పూర్తయ్యాయి. రెండు పథకాల కింద మొత్తం 36,516 ఇళ్ల నిర్మాణాలు జరిగాయి. తరువాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం... గతంలో మంజూరై ప్రారంభం కాని గృహాలను రద్దు చేసింది. పునాదులు, ఆపై నిర్మాణాలు చేసిన లబ్ధిదారులకు మాత్రం బిల్లులు చెల్లించనున్నట్లు ప్రకటించింది. ఆ మేరకు గత ఏడాది జిల్లా వ్యాప్తంగా 9,671 గృహాలు రద్దయ్యాయి. క్షేత్రస్థాయిలో మిగతా నిర్మాణాల పురోగతిపై అధికారులు ప్రభుత్వానికి నివేదికలు అందజేశారు. ఇంతవరకు బాగున్నా... గత ఏడాది జనవరి నుంచి బిల్లుల చెల్లింపు పూర్తిగా నిలిచిపోవడంతో లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందులోనూ ఎక్కువ మందికి ఉపాధి హామీ పథకం కింద రావాల్సిన నిధులు నిలిచిపోయాయి. జిల్లా వ్యాప్తంగా లబ్ధిదారులకు మొత్తంగా రూ.79 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉంది.
తప్పని ప్రదక్షిణలు...
ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద రూ.1.50 లక్షలు; ఎన్టీఆర్ గ్రామీణ పథకం కింద రూ.2 లక్షలు... ఇంటి నిర్మాణ దశలను బట్టి విడతల వారీగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తారు. ఉపాధి హామీ కింద తొలి పథకానికి రూ.55 వేలు, రెండో పథకానికి రూ.58 వేలు చొప్పున కేంద్ర ప్రభుత్వ నిధులు ఇస్తారు. తొంభై రోజుల పనిదినాల కింద రూ.17,460; మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.12 వేలు; ఇటుకలకు రూ.25,540 చొప్పున మొత్తం రూ.55 వేలు చెల్లించాలి. రెండో పథకానికి ఇటుకల కోసం అదనంగా మరో రూ.3 వేలు ఇస్తారు. లబ్ధిదారుల్లో కొందరికి పని దినాల కింద చెల్లింపులు జరగ్గా... మరి కొందరికి ఇటుకల డబ్బులు మాత్రమే జమ అయ్యాయి. ఉపాధి హామీ కింద పూర్తిగా బిల్లులు రాని వారు కూడా ఉన్నారు. దీంతో బయట నుంచి అప్పులు తెచ్చి నిర్మాణాలు పూర్తిచేసుకున్న పేదలు వడ్డీలు కట్టలేక అవస్థలు పడుతున్నారు. బిల్లుల కోసం మండల గృహనిర్మాణ, డ్వామా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ప్రభుత్వం నుంచి నిధుల మంజూరు లేక గృహనిర్మాణశాఖ అధికారులు సైతం సమాధానం చెప్పలేని పరిస్థితి ఉంటోంది.
త్వరలోనే బిల్లులు...