ప్రకాశం జిల్లాలోని త్రిపురాంతకం మండలంలో కొన్నేళ్ల పాటు పంచాయతీల్లో సర్పంచిగా చేసిన నాయకులు ప్రస్తుత ఎన్నికల్లో తిరిగి పోటీకి ముందుకు వచ్చారు. మాజీ సర్పంచులు మళ్లీ గెలుపు దిశగా పావులు కదుపుతూ పల్లె పోరుకు దిగారు. ఈ నెల 21న జరగనున్న పంచాయతీ ఎన్నికలకు చేపట్టిన నామినేషన్ ప్రక్రియ పర్వం ఈ నెల 12 ముగియగా నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ మంగళవారంతో ముగిసింది. దీంతో బరిలో నిలిచే అభ్యర్థులను అధికారులు ప్రకటించారు.
పంచాయతీ పోరు.. పోటీకి సిద్ధంగా మాజీ సర్పంచ్‌లు - త్రిపురాంతకం మండలంలో పంచాయతీ ఎన్నికలకు సిద్దమైన మాజీ సర్పంచ్‌లు న్యూస్
పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మాజీ సర్పంచ్‌లు తీవ్ర ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రకాశం జిల్లాలోని త్రిపురాంతకం మండలంలోని పలు పంచాయతీల్లో.. కొన్నేళ్ల పాటు సర్పంచ్‌గా చేసిన నాయకులు ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముందుకొచ్చారు. ఈ క్రమంలో గెలుపు దిశగా పావులు కదుపుతున్నారు.
పనితీరును చూడాలని వేడుకోలు..
అనేక మంది మాజీ సర్పంచులు మళ్లీ బరిలోకి దిగారు. తమను గెలిపించాలంటూ రచ్చబండ సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గ్రామంలోని బలమైన సామాజిక వర్గాలను సమీకరిస్తున్నారు. తమను గెలిపిస్తే సొంత నిధులతో గ్రామాభివృద్ధికి పాటుపడతామని కొందరు భరోసా ఇస్తున్నారు. తాము దేవాలయాలు, సామాజిక భవనాలను నిర్మిస్తామని మరికొందరు హామీ ఇస్తున్నారు. తమ హయాంలో జరిగిన అభివృద్ధిని బేరీజు వేసుకుని ఈ సారి కూడా తమను ఆశీర్వదించాలని అభ్యర్థిస్తున్నారు.
- త్రిపురాంతకం మండలంలో 24 గ్రామ పంచాయతీలున్నాయి. ముడివేముల సర్పంచిగా బరిలో నిలిచిన దేవినేని చలమయ్య కొన్నేళ్ల క్రితం ఆ గ్రామ సర్పంచిగా పని చేశారు. అక్కడ ఈసారి జనరల్‌కు కేటాయించడంతో మళ్లీ బరిలో నిలిచారు. కె.అన్నసముద్రంలో మాజీ సర్పంచి వంకాయలపాటి ఆంజనేయులు తన కోడలిని, పాత అన్నసముద్రంలో మాజీ సర్పంచి పాతకోటి చిన్న వెంకటేశ్వర్లు తన భార్యను, గణపవరంలో మాజీ సర్పంచి తన కూతురిని రంగంలోకి దించారు.
- యర్రగొండపాలెంలో 18 పంచాయతీలు ఉండగా యర్రగొండపాలెం మేజర్ పంచాయతీ సర్పంచిగా తాజా మాజీ సర్పంచి సొరకాయల మంగమ్మ మళ్లీ పోటీ చేస్తున్నారు. మరోసారి ఎన్నికల బరిలో తన ప్రత్యర్థితో తలపడనున్నారు. మిల్లంపల్లి మాజీ సర్పంచిగా చేసిన మాజీ ఎంపీపీ, మాజీ జడ్పీటీసీ మంత్రు నాయక్ కాశీకుంట తండా సర్పంచిగా మరోసారి ప్రయత్నిస్తున్నారు.
- పెద్దదోర్నాల మండలంలో 12 పంచాయతీలకు గాను పెద్దదోర్నాల మేజర్ పంచాయతీలో తాజా మాజీ సర్పంచి టి.మరియమ్మ, జమ్మి దోర్నాల పంచాయతీకి మాజీ సర్పంచి పడిదెపు చంద్రమ్మ మళ్లీ సర్పంచిగా పోటీ చేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. రాజకీయాలకు అతీతంగా పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నా ప్రత్యక్షంగా, పరోక్షంగా పార్టీల ప్రమేయం ఉంటోంది. వైకాపా, తెదేపా గ్రామాల్లో మంచి పట్టు ఉన్న మాజీలను తిరిగి ఎన్నికలో బరిలో దింపడంతో మాజీల పోరుపై అంతటా ఆసక్తి నెలకొంది.