ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Road accident: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి - ప్రకాశం జిల్లాలో రోడ్డుప్రమాదం ఐదుగురు మృతి

Five killed
ఐదుగురు మృతి

By

Published : Aug 8, 2022, 6:03 AM IST

Updated : Aug 9, 2022, 6:23 AM IST

05:59 August 08

Five killed in road accident: లారీని వెనుక నుంచి వేగంగా ఢీకొన్న కారు

Five killed in road accident: ఓ యువకుడు ఉన్నత చదువుల కోసం యూకే వెళ్లాడు.. లండన్‌లో ఎంఎస్‌లో చేరాడు. ఆ ఆనందాన్ని కుటుంబ సభ్యులతో పంచుకోడానికని పది రోజుల క్రితమే సొంతూరికి వచ్చాడు. అయిదు కుటుంబాల వారు కలిసి రెండు వాహనాల్లో తిరుపతి యాత్రకు బయలుదేరారు. ఆనందోత్సాహాలతో బయలుదేరిన వారిని మృత్యువు వెంటాడింది. రోడ్డు ప్రమాదం అయిదుగురిని కబళించింది. ప్రకాశం జిల్లా కంభం పట్టణ పాల డెయిరీ సమీపంలో అమరావతి-అనంతపురం జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ముందు వెళ్తున్న లారీని వీరి కారు వెనుక నుంచి వేగంగా ఢీ కొనడంతో అందులోని అయిదుగురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మృతులంతా పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం శిరిగిరిపాడుకు చెందినవారు. పోలీసుల కథనం మేరకు.. ఐదు కుటుంబాలకు చెందిన 14 మంది బంధువులు రెండు వాహనాల్లో ఆదివారం అర్ధరాత్రి తిరుపతికి బయలుదేరారు. 9 మందితో ఉన్న ఓ వాహనం ముందుకు వెళ్లిపోగా అయిదుగురితో బయలుదేరిన మరో కారు కంభం సమీపంలో సిమెంట్‌ లోడు లారీని వెనుక నుంచి వేగంగా ఢీ కొంది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసమైంది. అందులో ప్రయాణిస్తున్న చిలకల పెద్ద హనిమిరెడ్డి (70), చిలకల ఆదిలక్ష్మి (60), భూరెడ్డి గురవమ్మ (55), పల్లె అనంతరాములు (50) జూలకంటి నాగిరెడ్డి (23), అక్కడికక్కడే మృతి చెందారు. స్థానిక సీఐ రాజేష్‌కుమార్‌, ఎస్సై నాగమల్లేశ్వరరావు ఘటన స్థలానికి చేరుకుని ముందు వెళ్తున్న వాహనంలోని బంధువులకు ఈ సమాచారం అందించారు. వారు అప్పటికే సుమారు 25 కిలోమీటర్ల మేర ముందుకు వెళ్లిపోయారు. వెంటనే వెనుదిరిగి సంఘటన స్థలానికి తిరిగి వచ్చి మృతులను చూసి బోరున విలపించారు. ముగ్గురు అక్కా చెల్లెళ్లు, తాత, మనవడు ఈ ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు, కన్నీరుమున్నీరుగా విలపించారు.

మొక్కు తీర్చేందుకు వెళుతూ..

శిరిగిరిపాడుకు చెందిన పెద్ద హనిమిరెడ్డి, ఆదిలక్ష్మి దంపతులకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె కొడుకు నాగిరెడ్డి (23). లండన్‌లో ఎంఎస్‌ చదువుతున్నాడు. అక్కడే పార్టు టైం ఉద్యోగంలో చేరాడు. తిరుపతి మొక్కు తీర్చుకునేందుకని పది రోజుల కిందటే సొంతూరికి వచ్చాడు. ప్రమాదానికి గురైన సమయంలో కారును అతడే నడుపుతున్నాడు. ఈ దుర్ఘటనలో మృతి చెందిన ఆదిలక్ష్మి, పెద్ద హనిమిరెడ్డిల మనవడు ఇతడు. మృతుల్లో గురవమ్మ, అనంతరాములు ఆదిలక్ష్మి ముగ్గురు అక్కాచెల్లెళ్లు. గురవమ్మకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఆమె భర్త కొన్నేళ్ల కిందట చనిపోయారు. అనంతరాములుకు భర్త పున్నారెడ్డి, ఒక అమ్మాయి ఉన్నారు. ఈమెది సొంతూరు పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం రేమిడిచర్ల. సోదరి కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి వెళ్లేందుకు వచ్చి వీరు ఇద్దరూ మృత్యువాత పడ్డారు.

రేడియం స్టిక్కర్‌ కనిపించక..

ఈ ప్రమాదంలో కారు వెనుక నుంచి ఢీకొన్న లారీ మాచర్ల నుంచి బెంగళూరుకు సిమెంట్‌ లోడుతో వెళ్తోంది. లారీ వెనుక అతికించిన రేడియం స్టిక్కర్‌ కనిపించకుండా కింది వరకు పట్టా కట్టడం, కారు అతి వేగం ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.


ఇవీ చదవండి:

Last Updated : Aug 9, 2022, 6:23 AM IST

ABOUT THE AUTHOR

...view details