ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 21, 2019, 2:48 PM IST

ETV Bharat / state

మా బతుకులకు భరోసా ఇయ్యండయ్యా..!

కడలి కన్నెర్రచేసిన... ఆ మత్స్యకారుల కుటుంబాలకే బాధ! ఇప్పుడు మరో రూపంలో సమస్యలు  వెంటాడుతున్న  ఎలా వాటిని అధిగమించాలో తెలియని దయనీయ బతుకులు ఆ కుటుంబాలవి. పొట్టకూటికై సముద్రం నడిబొడ్డున చిన్న చిన్న బోట్లతో జీవనం సాగిస్తున్న వారిని...తమిళనాడు జాలర్లు హడలెత్తిస్తున్నారు. భారీ స్టీమర్​లతో తీరంలో వేటసాగిస్తూ మత్స్యకారుల సంపద దోచుకుంటున్నారు. వేట కోసం ఉంచిన వలలను, చిన్న చిన్న బోట్లను నాశనం చేస్తూ తీవ్ర నష్టాన్ని మిగులుస్తున్నారు. జాతీయ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా వారి మనోవేదనపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

వేటకు వెళ్తున్న మత్స్యకారులు



సముద్రంపై జీవించే సాంప్రదాయ మత్స్యకారుల కుటుంబాల పరిస్థతి ఆగమ్యాగోచరంగా మారింది. ప్రకాశం జిల్లాలో 102 కిలోమీటర్ల మేర సముద్రతీరం విస్తరించి ఉంది. వేటపాలెం, చీరాల, చినగంజాం, కొత్తపట్నం, నాగులుప్పలపాడు, టంగుటూరు, సింగరాయకొండ, గుడ్లూరు, ఉలవపాడు మండలాల్లో మత్యకార కుటుంబాలు చేపల వేట మీదే ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకార కుటుంబాలకు సరికొత్త పథకాలు తీసుకొచ్చినా వారిని మాత్రం తమిళజాలర్లు బెంబేలెత్తిస్తున్నారు. వేట విరామ సమయంలో గత ప్రభుత్వం ఇచ్చిన భృతి రూ. 4 వేల కంటే రూ. 10 వేలు పెంచిన... మర బోట్లకు రాయితీతో డీజిల్ అందించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నా.... తమిళనాడు బోట్ల నుంచి ఎదుర్కొంటున్న సమస్య ఇబ్బందులు పాల్జేస్తోంది.


హద్దులు దాటిన వారి ప్రయాణం.... మత్స్యకారుల జీవనానికే ప్రమాదం
నిర్ణీత హద్దులు దాటి వేటచేయకూడదన్న నిబంధనలు ఉన్నా... తమిళనాడులోని పాండిచ్చేరి , కచ్చలూరు జాలర్లు మాత్రం సరిహద్దులు దాటి ఆంధ్రాలోకి ప్రవేశిస్తున్నారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాల సాంప్రదాయ మత్స్యకారుల ఉపాధి దెబ్బతీస్తున్నారు. భారీ స్టీమర్లతో వారం నుంచి 15 రోజుల పాటు ప్రకాశం తీర ప్రాంతాల్లో తిష్టవేసి వేట సాగిస్తున్నారు. తీరంలో వేట కోసం ఏర్పాటు చేసిన వలలను సైతం చెల్లా చెదురు చేసి నష్టం మిగులుస్తున్నారు. బృందాలుగా తీర ప్రాంతంలో వేట సాగిస్తుండగా... అడ్డుకునే ప్రయత్నం చేస్తే భయ బ్రాంతులకు గురిచేస్తున్నారు. దీని వల్ల వేట సాగక మత్స్యకారుల కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాయి.

ప్రభుత్వం సాయం అందించాలి..!


ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ఈ సమస్యపై దృష్టి పెట్టాలని జాలర్లు వేడుకుంటున్నారు. మెరైన్ పోలీసు సిబ్బందికి స్పీడ్ బోట్లు అందించి.. నిరంతరం గస్తీ పెట్టాలని కోరుకుంటున్నారు. తమిళనాడు ప్రభుత్వంతో చర్చలు జరిపి తమిళ జాలర్లు సరిహద్దులు దాటి రాకుండా చూడాలని సూచిస్తున్నారు. తమకు రాయితీతో చేప పిల్లలు అందివ్వాలని కోరుతున్నారు.

మా బతుకులకు భరోసా ఇయ్యండయ్యా..!


ఇదీచూడండి.బడిలో భరోసా కేంద్రం... విద్యార్థినుల్లో ఆనందం

ABOUT THE AUTHOR

...view details