Fire accident: ప్రకాశం జిల్లా కొమరోలు మండలం పెద్దవాడ వద్ద కర్నూలు నుంచి ఉలవపాడుకు నిండు సిలిండర్ లోడ్‌తో వెళ్తున్న లారీ ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన లారీ డ్రైవర్ బయటకు దూకేశాడు. మంటల్లో లారీతో పాటు అందులోని గ్యాస్ సిలిండర్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. లారీలో 306 సిలిండర్లు ఉన్నట్లు డ్రైవర్ తెలిపారు. మంటల ధాటికి వాటిలో 100కిపైగా గ్యాస్ సిలిండర్లు పేలడంతో ఆ శబ్ధాలకు జనం ఉలిక్కిపడ్డారు.
కర్నూలు నుంచి నెల్లూరు జిల్లా ఉలవపాడుకు భారత్ గ్యాస్ సిలిండర్లతో వెళుతున్న లారీ క్యాబిన్‌లో మంటలు వచ్చాయి. గమనించిన వెంటనే డ్రైవర్ మోహన్‌రాజు లారీ ఆపి కిందికి దిగి తప్పించుకున్నారు. మంటల్లో ఉన్నవి నిండు గ్యాస్ సిలిండర్లు కావడంతో జాతీయ రహదారిపై ఇరు వైపులా అర కి.మీ. దూరంలో వాహనాలు నిలిపివేశారు. కొంచెం సేపటికి సిలిండర్లు పేలడం ప్రారంభం కావడంతో పోలీసులు అప్రమత్తమై అటువైపు ఎవరినీ వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు.