ప్రకాశం జిల్లావ్యాప్తంగా గత రెండు వారాల నుంచి వర్షాలు ముమ్మరంగా కురుస్తున్నాయి. దీంతో రైతులు ఖరీఫ్‌కు సన్నద్ధమవుతున్నారు. భూములు పదునెక్కడంతో ఎరువులు, విత్తనాల కొనుగోళ్లపై దృష్టి సారించారు. ఇప్పటికే దుక్కులు కూడా దున్నుకుంటున్నారు. ఈ క్రమంలో గ్రామాల నుంచి పట్టణాలకు ఎరువులు కొనుగోలు చేసేందుకు కర్షకులు పెద్దఎత్తున వస్తున్నారు. దీన్ని ఆసరాగా తీసుకున్న పలువురు వ్యాపారులు మోసాలకు పాల్పడుతున్నారు. కొన్నిచోట్ల తరుగులు, మరికొన్ని చోట్ల ధరల్లో వ్యత్యాసం చూపుతూ దోపిడీ చేస్తున్నారు.
ఒక్కో బస్తాలో కిలో, అర కిలో తరుగు తీసేస్తూ.. ఎటా సరఫరా చేసే లక్షలాది బస్తాలను పరిగణలోకి తీసుకుంటే వివిధ కంపెనీలకు భారీగా మిగులుతోంది. డీఏపీ, యూరియా, సూపర్‌పాస్పెట్, కాంప్లెక్స్ ఎరువులకు స్థానికంగా మంచి గిరాకీ ఉంది. జిల్లావ్యాప్తంగా ఈ రకాలను రైతులు లక్షలాది టన్నులు వినియోగిస్తున్నారు. దీంతో ఎరువుల దుకాణ దారులు సైతం ఎంఆర్‌పీ కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ఇటీవల కందుకూరు, ఒంగోలు, కనిగిరి పట్టణంతో పాటు, మండలంలోని అడ్డరోడ్డులో, పామూరు పట్టణంలో విక్రయాల్లో అవకతవకలకు పాల్పడుతున్న వ్యాపారులపై కేసులు నమోదు చేసి జరిమానా విధించారు.
మారని తీరు..
జిల్లావ్యాప్తంగా ఎరువుల విక్రయదారుల మోసాలపై తూనికల కొలతల శాఖాధికారులు దాడులు చేస్తున్నారు. అయినా పరిస్థితుల్లో మాత్రం మార్పులు రావడం లేదు. పలుకుబడి ఉపయోగించుకుంటూ తిరిగి దుకాణదారులు తమ వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. ఏడాది కాలంగా 20 కేసుల వరకు నమోదయ్యాయి. అయినప్పటికీ కంపెనీలపై ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం దురదృష్టకరం.