ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దక్కని రాయితీ.. శనగ విత్తనాలు కొనేందుకు రైతు నిరాసక్తత - ప్రకాశం జిల్లాలో శనగ విత్తనాలపై వార్తలు

రాయితీపై పంపిణీ చేసే శనగల ధర అధికంగా ఉండడంతో తీసుకునేందుకు ఈ సంవత్సరం రైతులు అంతగా ఆసక్తి చూపడం లేదు. రైతు భరోసా కేంద్రాలలో పేర్లు నమోదు చేసుకోవాలని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. అధిక ధర నిర్ణయించడంపై రైతులు వ్యవసాయ అధికారులపై బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

farmers not showing interest to buy bengal gram seed due to increase of price
శనగ విత్తనాలు కొనేందుకు రైతు నిరాసక్తత

By

Published : Oct 17, 2020, 6:33 PM IST

రైతులకు పంపిణీ చేసేందుకు శనగలకు ప్రభుత్వం నిర్ణయించిన రాయితీ ధరపై రైతుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. అసలే గిట్టుబాటు ధరలేక ఇబ్బంది పడుతున్న సమయంలో.. ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాఫెడ్‌, మార్క్‌ఫెడ్‌ ద్వారా జేజీ-11 రకం శనగలు కొనుగోలు చేశాయి. రైతులకు చెల్లించిన ధర క్వింటాకు రూ.4875. ప్రసుతం రాయితీ ఇచ్చేందుకు సేకరించిన శనగలకు మాత్రం క్వింటా ధర రూ. 7500 గా నిర్ణయించడం గమనార్హం.

బహిరంగ మార్కెట్‌లో ప్రస్తుతం జేజీ-11 రకం శనగలు క్వింటా రూ.5200 పలుకుతుంది. ప్రభుత్వం 30 శాతం రాయితీపై ప్రకటించిన ధర రూ.5250లు (క్వింటా). ప్రభుత్వం రాయితీపై ఇచ్చే ధర కన్నా మార్కెట్‌లోనే తక్కువ ధరకు శనగ విత్తనాలు దొరుకుతున్నాయి. కాక్‌-2 రకం క్వింటా రూ.5800 ఉంది. ప్రభుత్వం ఇదే రకానికి క్వింటా ధర రూ.7700గా నిర్ణయించింది. దీనిపై 30 శాతం రాయితీ ఇచ్చారు. ఈ ప్రకారం రైతు కొనుగోలు చేసినా.. రూ.5390 చెల్లించాల్సి ఉంటుంది.

విత్తనం కోసం తిప్పుతున్నారు..

విత్తనాల కోసం రైతు భరోసా కేంద్రం, గ్రామ సచివాలయం వద్దకు రైతు మూడు సార్లు వెళ్లాలి. పేరు నమోదు చేయించుకునేందుకు రైతు భరోసా కేంద్రం వద్దకు, సొమ్ము చెల్లించేందుకు గ్రామ సచివాలయం, విత్తనాలు తీసుకునేందుకు మరోసారి రైతు భరోసా కేంద్రానికి రైతులు వెళ్లక తప్పని పరిస్థితి ఉందని చెబుతున్నారు.

రాయితీ ధర ఎక్కువగా ఉన్నందున ఇన్ని సార్లు తిరిగి విత్తనాలు తీసుకోవాల్సిన అవసరం ఏముందని రైతులు ప్రశ్నిస్తున్నారు. ప్రైవేటు వ్యాపారులు లేదా... శీతల గోదాముల్లో నిల్వ చేసుకున్న రైతుల వద్ద నాణ్యతను పరిశీలించాకే.. కొనుగోలు చేయడం మేలనే అభిప్రాయాన్ని రైతులు వ్యక్తం చేస్తున్నారు.

శుద్ధి కోసమే రూ.రెండు వేలు పెంచారు

రాయితీపై పంపిణీ చేసేందుకు వ్యాపారుల నుంచి శనగలు సేకరిస్తారు. వాటిని శుద్ధి చేసి ప్యాక్‌ చేస్తారు. ఇందు కోసం క్వింటాకు రూ. 2 వేలకు పైగా వెచ్చిస్తున్నట్లు ప్రకటించిన ధరలను పరిశీలిస్తే తెలుస్తోంది. గతంలో ఎన్నడూ ఇంతగా ధరల వ్యత్యాసం లేదని రైతులు చెబుతున్నారు. రాయితీపై పంపిణీ చేసేందుకు ప్రభుత్వం విత్తనాలు సేకరించే సమయంలో.. వ్యాపారులు కూటమిగా మారి అధిక ధర దక్కేలా చేసుకున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. రాయితీ విత్తనాల వలన ఎలాంటి ప్రయోజనం లేదని వాపోతున్నారు.

ఆసక్తి చూపని రైతులు

విత్తనాల కోసం రైతు భరోసా కేంద్రాలలో పేర్లు నమోదు చేసుకోవాలని వ్వయసాయాధికారులు చెబుతున్నారు. పేర్లు నమోదు చేసుకున్న రైతులు గ్రామ సచివాలయాలలో డిజిటల్‌ సహాయకులకు డబ్బు చెల్లించి రశీదులు తీసుకోవాలని సూచించారు. ఈ నెల 19 నుంచి విత్తనాలను రైతు భరోసా కేంద్రాల నుంచి పంపిణీ చేయునున్నట్లు వెల్లడించారు. అధిక ధర నిర్ణయించడంపై రైతులు వ్యవసాయ అధికారులపై బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ధర నిర్ణయం తమ శాఖ పరిధిలోనిది కాదని చెబుతున్నా.. రైతులు వినడం లేదని ప్రకాశం జిల్లా పర్చూరు మండలం అన్నంబొట్లవారి పాలెం రైతు భరోసా కేంద్రం సిబ్బంది వాపోయారు. శుక్రవారం రాయతీ శనగల కోసం వచ్చిన రైతులు ఆందోళన చేశారు.

మార్కెట్‌ ధరకు ఇస్తే ఉపయోగం ఏంటి

ప్రభుత్వం చెబుతున్న రాయితీ వలన రైతులకు ఉపయోగం లేదు. మార్కెట్‌ ధరకే రాయితీ మీద ఇస్తున్నారు. విత్తన సరఫరాదారులకు ప్రయోజనం చేకూర్చేలా ఉంది.రాయితీ పేరుతో ప్రభుత్వంపై అదనపు భారం పడుతోంది. ప్రభుత్వం నిర్ణయించిన రాయితీ ధర కంటే తక్కువకే బహిరంగ మార్కెట్‌లో విత్తనాలు దొరుకుతున్నాయి. - గోరంట్ల బాబు, రైతు, అన్నంబొట్లవారిపాలెం

ఇదీ చదవండి: 'సీఎం ధోరణి.. న్యాయవ్యవస్థ స్వతంత్రతకే ప్రమాదం'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details