ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఎన్ని బోర్లు వేసినా...కనపడని నీటి జాడ' - money

ఎకరా భూమిలో వేసిన పంటను కాపాడుకునేందుకు ఓ రైతు 500 అడుగుల మేర బోరు వేశాడు. నీరు తక్కువగా కనిపించింది. సాగుకు అది సరిపోకపోవటంతో మరో బోరు వేశాడు. అందులోనూ అదే పరిస్థితి. ఇలా ఎకరా పంటను కాపాడుకునేందుకు 6లక్షలు ఖర్చుపెట్టి ఆరు బోర్లు వేశాడు. అయినా పంట చేతికి రాక చివరికి అప్పులపాలయ్యాడు. ఆ రైతే కాదు... ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంత రైతులందరీ పరిస్థితి ఇదే.

farmers

By

Published : Jul 26, 2019, 1:59 PM IST

'ఎన్ని బోర్లు వేసినా...కనపడని నీటి జాడ'

ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతానికి ఉన్న నీటి వనరులు అంతంతమాత్రమే. ఈ ప్రాంత రైతులు ఎక్కువగా భూగర్భ జలాలపై ఆధారపడే పంటలు సాగు చేస్తుంటారు. వర్షాలు పడి భూగర్భజలాలు సమృద్ధిగా లభిస్తే.. 100 నుంచి 150 అడుగుల లోపే రైతులకు నీరు లభించేది. సాగునీటి వనరులు అందుబాటులో లేకపోవడంతో, ఎక్కువమంది రైతులు ఈ పద్ధతినే అనుసరించారు.

అయితే రానురాను పరిస్థితిలో మార్పు మొదలైంది. భూగర్భజలాల లభ్యత తగ్గిపోవడంతో, రైతులు వేసే బోర్ల సంఖ్యతో పాటు.. లోతు కూడా పెరిగింది. నీటి కోసం 500 నుంచి 600 అడుగులకు పైగా తవ్వడం మొదలుపెట్టారు. అయినా అర ఇంచు కూడా నీటిజాడ కనిపించడం లేదు. పంటను కాపాడుకోవాలనే ఆశతో, బోర్ల సంఖ్యను పెంచుకుంటూపోతున్నారు. అయినా నీటిజాడ కనిపించడం లేదు.

ఎకరా పొలంలో వేసిన మిరప పంటను కాపాడుకునేందుకు 6 లక్షలకు పైగా ఖర్చుచేశాడో రైతు. అయినా చివరికి పంట చేతికి రాక అప్పులపాలయ్యాడు. పంట పెట్టుబడి కంటే.. సాగునీటి కోసం రెండు, మూడింతలు అధికంగా ఖర్చు చేశాడు. అయినా నీటిజాడ కనిపించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నష్టాలను భరించలేక వ్యవసాయాన్నే వదిలేసే పరిస్థితికి చేరుకున్నామని.. రైతులు దీనంగా చెబుతున్నారు. సాంకేతిక ద్వారా నీటి లభ్యతను గుర్తించే ఏర్పాటు చేయడంతో పాటు.. బోర్లు వేసుకునేందుకు ఆర్థికసాయం చేయాలని రైతులు కోరుతున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details