Farmers in trouble due to brokers: సుబాబుల్, జామాయిల్...నష్ట భయం లేని పంటలుగా ఒకప్పుడు చెప్పుకొనేవారు. మూడేళ్లు తోటను సాకితే... ఎకరాకు కనీసం రూ.80 వేల నుంచి రూ.లక్ష ఆదాయం వచ్చేది. ప్రస్తుతం పరిస్థితి తలకిందులైంది. ప్రభుత్వ నిర్లిప్తత, దళారుల మాయాజాలంతో తక్కువ ధరకు అడుగుతుండడంతో... ఏం చేయాలో తెలియక కర్ర రైతులు తల్లడిల్లుతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 13 లక్షల టన్నుల జామాయిల్, 12 లక్షల టన్నుల సుబాబుల్, 2లక్షల టన్నుల సరుగుడు కోతకు సిద్ధంగా ఉన్నట్లు అంచనా. ఉమ్మడి ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లోనే ఈ విస్తీర్ణం ఎక్కువగా ఉంది.
నాడు... మార్కెట్ కమిటీలతో మేలు
గతంలో మార్కెట్ కమిటీల ఆధ్వర్యంలో కొనుగోళ్లు జరిపేవారు. ప్రభుత్వం టన్ను సుబాబుల్‌కు రూ.4,200, జామాయిల్‌కు రూ.4,400 గిట్టుబాటు ధర నిర్ణయించినా రైతుకు నికరంగా రూ.3 వేల నుంచి రూ.3,500 వరకు వచ్చేది. నేరుగా రైతుల ఖాతాకు నగదు జమ అయ్యేది. అప్పట్లో మార్కెట్ కమిటీలు, అధికారుల పర్యవేక్షణ కారణంగా... అక్రమ రవాణాకూ అడ్డుకట్టపడింది.
నేడు... దళారులదే రాజ్యం
ప్రస్తుతం కర్ర వ్యాపారం పూర్తిగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయింది. అంతా తామే అన్నట్లు దళారీలు వ్యవహరిస్తున్నారు. కంపెనీలూ నేరుగా కొనుగోళ్లు ఆపేసి... పరోక్షంగా వారికి సహకరిస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదే అదునుగా మూడేళ్లుగా కర్ర కొనుగోళ్లు నిలిపేశారని గ్రామాల్లో ప్రచారం చేస్తున్న దళారులు... టన్నుకు రూ.800 నుంచి రూ.1400 మధ్య అడుగుతున్నారు. జామాయిల్‌ను తీసుకోవడం లేదు. చిల్లకంప కంటే తక్కువ ధర వస్తుండడంతో చేసేదేమీ లేక కొందరు రైతులు పొగాకు బ్యారన్ కాల్పునకు ఈ కర్ర వినియోగించారు. ఇంకొందరు హోటళ్లకు వంట చెరకుగానూ విక్రయిస్తున్నారు.