ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈ - పంట నమోదు కష్టాలు.. ఆందోళనలో రైతన్నలు..! - ఏపీలో ఈ-పంట నమోదు వార్తలు

ఆరుగాలం శ్రమించే రైతన్నలు విత్తు నాటే దగ్గర నుంచి పంటను ఇంటికి చేర్చుకునే వరకు అడుగడుగునా కష్ట నష్టాలను చవిచూస్తున్నారు. ప్రకృతి విపత్తుల సమయంలో ప్రభుత్వ సాయం పొందే వెసులుబాటును పూర్తిస్థాయిలో వినియోగించుకోలేక పోతున్నారు. దీనికి తగినట్లే అధికారులు, సిబ్బంది వ్యవహారం ఉంటోంది. ఆన్‌లైన్‌ నమోదు, దాని ప్రయోజనాలను రైతులకు సవివరంగా గా వివరించాల్సిందిపోయి.. వారికి తెలుసులే అన్నట్లు వదిలేస్తున్నారు. ఫలితంగా తెలిసిన రైతులు ఆన్‌లైన్‌ చేసుకుంటుండగా.. తెలియని వారు విపత్తుల సమయంలో తీవ్రంగా నష్టపోతున్నారు.

e-crop registration
e-crop registration

By

Published : Dec 5, 2020, 6:00 PM IST

ప్రకాశం జిల్లాలో రబీ సాగు మొదలై రెండు నెలలైనా పంట నమోదు 50 శాతం కూడా పూర్తికాలేదు. దీంతో నివర్‌ తుపాను వర్షాలకు పంట నష్టపోయిన ఆలస్యంగా ఖరీఫ్‌ సాగు చేసిన రైతులతోపాటు రబీ సాగు చేసిన వారూ ఆవేదనలో కూరుకుపోయారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని ప్రజాప్రతినిధులు, అధికారులకు మొర పెట్టుకుంటున్నారు. రబీ సాధారణ సాగు విస్తీర్ణం 2.42 లక్షల హెక్టార్లు. అక్టోబరు నుంచి మొదలైన ఈ కాలంలో 35 వేల హెక్టార్లలో వివిధ పంటలను వేశారు. అయితే ఆ మేరకు ఈ-పంట నమోదు ప్రక్రియ పూర్తికాలేదు. ఒకవైపు పంట నమోదు మందకొడిగా సాగుతోంది. కొత్తపట్నం, వలేటివారిపాలెం తదితర మండలాల్లో 80 శాతం వరకు ఈ-పంట నమోదైనప్పటికీ కారంచేడు, కొండపి, జరుగుమల్లి, తాళ్లూరు, ఇంకొల్లు, పర్చూరు, మార్కాపురం, యర్రగొండపాలెం, పుల్లలచెరువు, రాచర్ల, కంభం, యద్దనపూడి, పెద్దారవీడు, దోర్నాల, అర్ధవీడు, చినగంజాం, ఉలవపాడు తదితర మండలాల్లో ఇంకా పది శాతం కూడా పూర్తికాలేదు. యాప్‌లో సాంకేతిక సమస్యలు, ప్రక్రియ ఆలస్యంగా మొదలుకావడం, వర్షాలు తదితరాలు జాప్యానికి కారణాలుగా కనిపిస్తున్నాయి.

  • కంభం మండలం నల్లకాలువ, యర్రబాలెం, నర్సిరెడ్డిపల్లి, తురిమెళ్ల గ్రామాల రైతులు తమ పంటలను ఈ-క్రాప్‌లో నమోదు చేయలేదని ఎమ్మెల్యే అన్నా రాంబాబు దృష్టికి తీసుకొచ్చారు. అన్ని సదుపాయాలున్నా పంటలను ఈ-క్రాప్‌లో నమోదు చేయరా...పైగా రైతుల నుంచి డబ్బులు తీసుకుంటారా..మీ కారణంగా పరిహారం పొందలేకపోతే ఆ బాధ ఎలా ఉంటుంటుందో తెలుసా అని అధికారులను నిలదీశారు. నష్టపోయిన వారి వివరాలు నమోదు చేసి న్యాయం చేయాలని కోరారు. ఈ పరిస్థితి అన్ని చోట్లా ఉండగా రైతులు లబోదిబోమంటున్నారు.
  • కనిగిరి మండలానికి చెందిన రైతు వెంకటరామిరెడ్డి కౌలుకు తీసుకుని రబీలో ఎనిమిది ఎకరాల్లో మినుము సాగు చేశారు. నివర్‌ కారణంగా పంట నీట మునిగింది. ఈ-క్రాప్‌ నమోదు పత్రాలన్నీ అందజేశారు. పరిహారం అందుతుందన్న ఆశతో ఆరా తీయగా ఇప్పటి వరకు ఆన్‌లైన్లో నమోదు కాలేదని తెలిసి దిగాలుపడ్డారు. మళ్లీ సచివాలయ సిబ్బంది, వాలంటీర్‌ను సంప్రదించగా ఇప్పుడు నమోదు చేస్తామని చెబుతున్నారని, చివరకు ఏమవుతుందోనని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రయోజనాలున్నా పట్టడం లేదు

ఈ-పంట నమోదు ప్రక్రియతో రైతులకు అనేక ప్రయోజనాలున్నాయి. పరిహారం, బీమా, ప్రభుత్వ సంస్థల్లో దిగుబడులు అమ్ముకోవాలన్నా, విత్తనాల పంపిణీ, రాయితీ పథకాల్లో ప్రాధాన్యం ఉంటుంది. అయితే కొందరు అవగాహన లేక, కార్యాలయాల చుట్టూ తిరగలేక పంటల సాగు వివరాలను ఆన్‌లైన్లో నమోదుకు చివరి వరకు నిర్లక్ష్యం చేస్తున్నారు. తీరా విపత్తులు వచ్చినప్పుడు నష్టపోయి ఆందోళన చెందుతున్నారు. దీంతో అధికారులు కూడా ఆ సమయంలో ఏమీ చేయలేక చేతులెత్తేస్తున్నారు. దీనిపై రైతులు కూడా అవగాహనతో ఉండాలి. భూమి సర్వే నెంబరు, ఆధార్‌, మొబైల్‌ నెంబరు, పంట పేరు, బ్యాంకు ఖాతా తదితర వివరాలతో కూడిన పత్రాలు ఇచ్చి నమోదు చేసుకుని తర్వాత సరిచూసుకోవాలి.

10లోపు అన్నీ పూర్తి చేస్తాం: జేడీఏ

'జిల్లాలో ఖరీఫ్‌కు సంబంధించి 99 శాతం ఈ-పంట నమోదు పూర్తి చేశాం. రబీలో ఇప్పటి వరకు 40 శాతం పూర్తయింది. యాప్‌ ఆలస్యంగా రావడం, నమోదు ప్రక్రియకు అయిదు రోజులు అంతరాయం కలగడంతో కొంత జాప్యమైంది. పదో తేదీలోపు నష్టపోయిన పంట వివరాలతోపాటు ఈ-పంట నమోదు ప్రక్రియను పూర్తి చేస్తాం. ఎవరైనా పంట నమోదు చేసుకోనివారు, ఆన్‌లైన్‌ నమోదులో ఇబ్బందులున్న వారు సమీప రైతు భరోసా కేంద్రాలు, వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించి ఈ-పంట నమోదు చేయించుకోవాలి.' - శ్రీరామమూర్తి, జేడీఏ

ఇదీ చదవండి

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ బసినికొండ వీఆర్వో

ABOUT THE AUTHOR

...view details