Farmers Problems: ప్రకాశం జిల్లా అద్దంకి రైతులు ఎక్కువ శాతం మిరప, మొక్కజొన్న, పొగాకు, కూరగాయలు, కరవేపాకు వంటి ఆరుతడి పంటలు వేసుకున్నారు. నవంబర్‌లో కురిసిన అధిక వర్షాలు కారణంగా పంటలు నీటిపాలయ్యాయి. నష్టాన్ని పూడ్చుకోవడం కోసం వర్షాలు తగ్గాక మళ్లీ నారువేసుకొని సాగు చేపట్టారు. అధికారులు ఆరుతడి పంటలు వేసుకోమని చెప్పడంతో.. వరి పండించకుండా ఈ పంటలపై దృష్టిపెట్టారు. సాగు ఆలస్యం కావడం వల్ల ఏప్రిల్ వరకూ పంటలకు నీటి అవసరం ఉంటుంది. అయితే సాగర్ నుంచి నీరు విడుదల చేయకపోవడంతో పంటలకు నీరు అందక ఎండిపోతున్నాయి.
మరో వైపు ఎగువున పూర్తిస్థాయిలో విడిచిపెట్టినా.. కాలువల నిర్వహణ సక్రమంగా లేక దిగువ పొలాలకు నీరు అందని దుస్థితి. కాలువల్లో పూడికలు తీయకపోవడం వల్ల పంటలకు నీరు అందక పంటలు నిర్జీవంగా మారాయి. అధికారులు చెప్పిన మాట ప్రకారం నీటిని విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు.