దొనకొండ ప్రాంతంలో మళ్లీ భారీ పరిశ్రమల దృష్టిపడటం, ఈక్రమంలో కావాల్సిన భూములు ఇచ్చేందుకు సిద్ధమని ప్రభుత్వం స్పష్టం చేయడం, ఆమేరకు కొన్నింటికి ఆమోదముద్ర వేయడం లాంటి కార్యకలాపాలతో.. దొనకొండ పరిసర ప్రాంతాల్లో పారిశ్రామిక సందడి కొనసాగుతోంది. పరిశ్రమలు వచ్చి వేగంగా అక్కడ అభివృద్ధి జరిగితే తమకు కూడా ప్రయోజనమే అన్న బావనలో స్థానిక ప్రజలు ఉన్నారు. వేల ఎకరాల విస్తీర్ణంలో ప్రారంభంకానున్న 1000 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ప్రాజెక్టుకు భూసేకరణ విషయంలో బాధిత గ్రామాల ప్రజలు అయోమయానికి గురవుతున్నారు.
ప్రభుత్వం ఎంతసేపూ భూముల సేకరణ విషయం పైనే దృష్టిసారించిందని, తమ గోడు వినిపించకోవడంలేదన్న ఆక్రందన వారిలో కనిపిస్తోంది. ఇదివరకు ఇస్తామన్న కౌలు ఏమాత్రం సరిపోదని, ఆవిధంగా భూములు తీసుకుంటే బువ్వకూడ లేని పరిస్థితులతో అల్లాడాల్సి వస్తుందని అక్కడి రైతులు వాపోతున్నారు. రైతులు ఎదుర్కొనే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రయోజనాలు కలిగేలా ప్రభుత్వం చూడాలని వారువేడుకుంటున్నారు.
4995 ఎకరాలలో...
దొనకొండ ప్రాంతంలో సోలార్ విద్యుత్ ప్లాంట్‌కు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఆమేరకు ఇప్పటికే దాదాపు 2400 ఏకరాల భూములను కూడా కేటాయించింది. మొత్తం 4995 ఎకరాలు అంచనా ఉండగా మిగిలిన భూములను సేకరించే పనిలో పడింది. అయితే అక్కడ రైతులు పంటలు పండించుకునే భూములు సేకరించాల్సి ఉండటంతో అధికారులు కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నారు.
సోలార్ విద్యుత్ అందుబాటులోకి వస్తే జిల్లా రైతులందరికీ ప్రయోజనమే. కానీ ఏళ్లుగా ఇక్కడ సాగుచేసుకుంటున్న రైతులు మాత్రం భూములు కోల్పోతే తమకు జీవనో పాధి పోతుందని, వలసలు పోవాల్సి వస్తుందని, చివరకు బువ్వ కూడా లేని పరిస్థితులు వస్తాయని ఆవేదన చెందుతున్నారు. అందుకే కొందరు రైతులు ఎట్టిపరిస్థితుల్లోనూ భూములు ఇచ్చేది లేదని, ఇవ్వాలంటే తమ డిమాండ్లను మన్నించి ఆమేరకు ప్రయోజనాలు కల్పించాలని మరికొందరు కోరుతున్నారు.
ఎకరాకు రూ.25 వేలా...
ఈ ఏడాది జూలైలో నిర్వహించిన గ్రామసభల్లో రైతుల అభిప్రాయాలను అధికారులు తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ సమక్షంలో రైతులకు నచ్చజెప్పారు. ప్రభుత్వం 9 గంటలు వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు ఇచ్చే క్రమంలో భాగంగా దొనకొండ మండలంలో వెయ్యి మెగావాట్ల సోలార్ ప్లాంట్ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపిందని, ప్రాజెక్టు కట్టడం తథ్యమని, జీవనోపాధికి నష్టం కలుగుతుందన్న ఆభిప్రాయాలు చెప్తే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. అలానే పట్టాలు ఉన్న వారికి ఎకరాకు రూ.25 వేలు ఏడాదికి కౌలు ఇస్తామని, ఈ సారి పంటలు వేయకూడదని చెప్పారు.