ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సాగు లేక తనువు చాలిస్తున్న రైతన్నలు - Farmers sucide news prakasham district

కాడి పట్టుకొని స్వేదం చిందించి, కాసులు పెట్టుబడిగా పెట్టి రాసులు పండిద్దామనుకున్న రైతన్నకు బతుకు చివరికి పుట్టెడు అప్పులు, ఊపిరి తీసే తాడు, పురుగు మందులే మిగులుతున్నాయి. రుణ భారం రైతులను ఆత్మహత్యలకు ప్రేరిపిస్తోంది. తాగుబోతును కాను, తిరుగుబోతును కాను సేద్యాన్ని నమ్ముకొని సర్వం కోల్పోయాను ... మీకొద్దురా కొడకా ఈ వ్యవసాయం అంటూ ఉత్తరాలు రాసి తనువు చాలిస్తున్నారు. బిడ్డలకు పొలం ఆస్తిగా మిగిల్చాలనుకున్న తల్లి దండ్రులు అప్పులు మిగులుస్తున్నందుకు కుమిలిపోతున్నారు. ప్రకాశం జిల్లాలో గత ఏడాది కాలంలో పలువురు రైతులు పంటలు లేక ఆత్మహత్యలు చేసుకున్నారు.

Farmers committing suicide in Prakasam district
అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్న రైతు

By

Published : Jun 18, 2020, 5:16 PM IST


ప్రకాశం జిల్లాలో 16 లక్షల ఎకరాల్లో పొగాకు, శనగ, మిర్చి, పత్తి, వరి, కందులు, బత్తాయి, నిమ్మ వంటి ప్రధాన పంటలు సాగవుతున్నాయి. అరకొర వర్షాలు సాగుకు సహకరించడం లేదు... పంట వేశారు కాబట్టి నీటి తడి ఇవ్వాలనే ఉద్దేశ్యంతో రైతులు భూగర్భ జలాలపై ఆధారపడుతున్నారు. లక్షలు అప్పులు చేసి బోర్లు తవ్వి సాగుచేయాలని ప్రయత్నిస్తున్నారు.

జిల్లాలో, ప్రధానంగా పశ్చిమ ప్రాంతంలో 600 లేదా700 అడుగులు తవ్వితేగానీ నీళ్లు రావడం లేదు. అదీ ఒకటి రెండు సీజన్లకే మాత్రమే వస్తుండగా మళ్లీ పొలంలో మరోచోట తవ్వడం, అక్కడ లేకపోతే ఇంకో చోట... ఇలా నాలుగైదు చోట్ల తవ్వడానికి లక్షల వరకు అప్పు చేయాల్సి వస్తోంది. అయినా పంట చేతికొచ్చినంత వరకు గ్యారంటీ లేదు... అప్పులు పాలైన రైతు చేసేది లేక ఆత్మహత్యకు పాల్పడుతున్నారు.

  • ఏడాదిలో 53 మంది...

గత ఏడాది కాలంలో 53 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. మరోవైపు పండిన పంట కూడా అమ్ముకోలేని దుస్థితి నెలకొంది. గత ముడేళ్ల నుంచి పండిన శనగ పంట ఇళ్లలోను, శీతల గిడ్డంగిల్లో నిల్వ ఉండిపోయింది. ఈ ఏడాది దాదాపు 13 లక్షల క్వింటాళ్ల పంట పండగ ప్రభుత్వం 3 లక్షల క్వింటాళ్లు మాత్రమే కొనుగోళ్లు చేసింది. జామాయల్, సుబాబులు కొనుకోళ్లు మాటే లేకపోగా, ప్రైవేట్ వ్యాపారులు కూడా అతి తక్కువ ధరకు కొంటుండటం వల్ల కోత ఖర్చులు కూడా రావని తోటలను వదిలేస్తున్నారు. మిర్చి, పొగాకు అధిక, అకాల వర్షాలకు దిగుబడి తగ్గిపోతుంది...గిట్టుబాటు ధర లేక, మార్కటింగ్ సౌకర్యం లేక నష్టపోతున్నామని రైతులు అంటున్నారు.

  • ఒక్కొక్కరిదీ ఒకో కథ...

గత వారం రోజుల్లోనే కొనకనమెట్ల మండలంలో ఇద్దరు రైతులు ఆత్మహత్యలకు పడ్డారు. పెదారకట్లకు చెందిన చెన్నారెడ్డి మూడు నెలలు క్రితం 10 లక్షలు అప్పు కావటంతో మనోవేదనకు గురయ్యాడు. తీర్చే మార్గం లేక రుణ భారాన్ని తట్టుకోలేక ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇద్దరు చిన్న బిడ్డలతో భార్య లక్ష్మీ దేవి దిక్కుతోచని పరిస్థితిలో ఉంది.

  • వ్యవసాయం చేయకండి... వేరే పనిచేసుకోండి..

పెద్దారవీడు మండలం సిద్దినాయునిపల్లికి చెందిన సింగారెడ్డి సత్యనారాయణరెడ్డి వ్యవసాయం కోసం చేసిన అప్పు తీర్చ లేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. సాగుపై అపేక్షతో వేరే దారిలేక సాగు చేస్తే లక్షల అప్పులు మిగిలాయని... సాగుమీద ఆధారపడకండి.. ఎదో పనిచేసుకొని బతకండి అంటూ లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

అద్దంకి మండలం కలవకూరుకు చెందిన రైతు పొన్నం శ్రీనివాస్​రావు ఈ ఏడాది జనవరి లో ఆత్మహత్య చేసుకున్నాడు. సాగు కోసం అతడు చేసిన అప్పులు తీర్చడానికి నానా కష్టాలు పడాల్సివస్తోందని భార్య సుబ్బాయమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. వచ్చిన బీమా సొమ్ముతో కొంత అప్పులు తీర్చామని, ఇంకా మిగిలి ఉందని, తన ఇద్దరి పిల్లలతో జీవనం దుర్భరంగా తయారయ్యిందని ఆమె కన్నీటి పర్యంతంమైంది.

  • ఆదుకుంటాం...

ఈ ఏడాది కాలంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు శ్రీరామ్మూర్తి పేర్కొన్నారు. ఇప్పటి వరకు 21 బాధిత కుటుంబాలకు 7 లక్షల చొప్పున పరిహారం చెల్లించామని తెలిపారు. మరో నలుగురివి పెండింగ్​లో ఇన్నాయని, త్రి సభ్య కమిటీ పరిశీలన తరువాత చెల్లింపులు ఉంటాయని ఆయన అన్నారు. రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులు పాటించాలని అధిక పెట్టుబడులు మానుకోవాలని, బ్యాంకుల వద్ద రుణాలు పొందాలని ఆయన సూచించారు.

ఇదీ చదవండి: 'దివ్యాంగుల సమస్యలు తీర్చాలి.. నెలకు రూ. 5 వేల పెన్షన్ ఇవ్వాలి'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details