ప్రకాశం జిల్లా మార్టూరు మండలం ఇసుకదర్శిలో అప్పులబాధ తాళలేక వ్యవసాయబావిలో దూకి ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇసుకదర్శి సమీపంలోని జాతీయ రహదారి పక్కన వ్యవసాయబావిలో వ్యక్తి మృతదేహం ఉండటాన్ని గమనించిన స్తానికులు పోలీసులకు సమాచారం అందించారు. అతణ్ని ఇసుకదర్శికి చెందిన కల్లూరి నాగేశ్వరరావు (53)గా పోలీసులు గుర్తించారు.
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య - prakasham farmer suicide
తనకున్న రెండు ఎకరాలకు మరో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. ఓ పంటకు కాకుంటే మరో పంటకైనా మంచి దిగుబడి వస్తుందేమోనని ఆశించాడు. పెట్టుబడి కోసం అప్పులు తీసుకొచ్చాడు. మూడేళ్లుగా సరైన దిగుబడి లేకపోవడంతో అప్పుల బాధ తాళలేక వ్యవసాయ బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది.
నాగేశ్వరరావు తన కున్న రెండు ఎకరాలకు మరో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకుని పొలం సాగు చేస్తున్నాడు . గత మూడేళ్లుగా గిట్టుబాటు ధరలు లేకపోవడంతో వ్యవసాయంలో నష్టాలు వచ్చాయి. ఈ ఏడాది మొక్కజొన్న పంటవేశాడు. పెట్టుబడికోసం తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరగటంతో మనస్థాపానికి గురైనట్లు కుటుంబసభ్యులు తెలిపారు. గురువారం సాయంత్రం బయటకు వెళ్లిన వ్యక్తి తెల్లారేసరికి వ్యవసాయ బావిలో శవమై తేలాడని కుటుంబసభ్యులు బోరున విలపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం మార్టూరు ప్రభుత్వ అసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి:కాలం చెల్లిన మందులు... బలైన పసిపాప ప్రాణాలు