ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీరామ నవమి సాక్షిగా... 'హనుమంతుడు మనవాడే'! - is lord hanumal telugu person news

హనుమంతుడు పుట్టింది అంజనాద్రిలోనేనని.. ఆయన మన తెలుగు వాడేనని ప్రకటించేందుకు తితిదే సన్నధమవుతోంది. ప్రకాశం జిల్లా చీరాల వాసి చేపట్టిన పరిశోధన, పురాణాలు, చరిత్ర పరిశోధకుల అధ్యయనాల ఆధారంగా వెల్లడించేందుకు తితిదే సిద్ధమవుతోంది.

lord hanuman belongs to the telugu
హనుమంతుడు

By

Published : Apr 19, 2021, 9:26 AM IST

హనుమంతుడు తెలుగువాడేనని, ఆయన జన్మస్థలం తిరుమలలోని అంజనాద్రి అని తగిన ఆధారాలతో శ్రీరామనవమినాడు ప్రకటించేందుకు తితిదే సిద్ధమవుతోంది. ఇదే విషయంపై ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన హనుమత్‌ ఉపాసకుడు డాక్టర్‌ అన్నదానం చిదంబర శాస్త్రి కొన్ని దశాబ్దాలుగా ప్రచారం చేస్తున్నారు. ఈ అంశంపై 1972 నుంచి పరిశోధనలు చేసి ఆయన కొన్ని ఆధారాలను సేకరించారు. పలు పురాణాలు, గ్రంథాలను అధ్యయనం చేశారు. హనుమంతుడి జీవితంపై ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ చేశారు. హనుమచ్చరిత్రకు ప్రామాణికమైన శ్రీపరాశర సంహితనూ ఆధారం చేసుకున్నారు. అది తాళపత్ర గ్రంథం. సంస్కృతంలో ఉన్న ఈ గ్రంథాన్ని చిదంబర శాస్త్రి తెలుగులోకి అనువదించారు. హనుమంతుడి జన్మస్థలం నిర్ధారణకు భవిష్యోత్తర పురాణం, బ్రహ్మాండ పురాణం, స్కాంద పురాణాలు, చరిత్ర పరిశోధకుల అభిప్రాయాలను కూడా పరిశీలించారు.

ఆయన ఏమంటారంటే..

హనుమంతుడి జన్మస్థలంపై చరిత్ర, సాహిత్యకారులు రకరకాలుగా చెబుతూ వచ్చారు. ప్రముఖ చరిత్రకారుడు కొమర్రాజు లక్ష్మణరావు 1920 ఫిబ్రవరిలో భారతి పత్రికలో కిష్కింధ-పంచవటి ప్రస్తుత బళ్లారి, హంపి ప్రాంతంలోనిదని పేర్కొన్నారు. రుష్యమూకలోని ‘మూక’ ద్రవిడ పదమని కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి వివరించారు. కిష్కింధను పాలించిన సుగ్రీవుడు సీతమ్మ అన్వేషణకు అంజనాద్రిలో నివసిస్తున్న వారి సాయాన్ని కోరారని పురాణాలు చెబుతున్నాయి. సురవరం ప్రతాపరెడ్డి తన ‘రామాయణ విశేషాలు’ గ్రంథంలో అంజనాద్రిలో నివసించిన వారు వానరులు కారని, దక్షిణాపథంలో ఉన్న ఆటవికులని అభిప్రాయపడ్డారు. 1986లో తితిదే ప్రచురించిన ‘సప్తగిరి’ పత్రికలోనూ ఇక్కడ నివసించినవారు గిరిజన జాతికి చెందిన సవరలని విశ్లేషణ ఉంది. మొదటిసారి తాను లంకకు వెళ్లి వచ్చానని హనుమంతుడు తన సహచరులకు చెబుతాడని, లంక తెలుగు పదమని చిదంబర శాస్త్రి వివరిస్తున్నారు. కలియుగంలో వేంకటాద్రిగా పిలిచే తిరుమల కొండలను త్రేతాయుగంలో అంజనాద్రి అనేవారని, అక్కడే అంజనాదేవి తపస్సు చేసి హనుమంతుడికి జన్మనిచ్చారని చెబుతున్నారు.

పురాణ ప్రమాణాలతో ప్రచారం

తాజాగా అయోధ్య రామమందిర నిర్మాణ సమయంలో హనుమంతుడి జన్మస్థానంపై మరోసారి చర్చలు ప్రారంభమయ్యాయి. హనుమంతుడు ఝార్ఖండ్‌లో జన్మించారని స్వామి గోపాలనంద బాబా వాదిస్తుండగా, ఆయన పుట్టింది తిరుమల అంజనాద్రిలోనేనని పురాణ ప్రమాణాలతో చిదంబర శాస్త్రి వివరించారు. ఆంజనేయుడు హంపీలో కిష్కింధ కొండ వద్ద జన్మించాడని మరో స్వామీజీ గోవిందానంద సరస్వతి ప్రచారం చేస్తున్నా.. అక్కడి హనుమంతుడి విగ్రహం పురాతనమైనది కాదని చిదంబర శాస్త్రి వివరిస్తున్నారు. గోకర్ణంలో స్వామి పుట్టాడనే ప్రచారాన్ని కూడా నిరాధారమని ఆయన పేర్కొంటున్నారు. హనుమంతుడి జన్మస్థలంపై పరిశోధన వివరాలను చిదంబరశాస్త్రి తొలుత తితిదేకు అందజేశారు. అక్కడినుంచి మొదట్లో పెద్దగా స్పందన లేకపోవడంతో ఆయనే స్వయంగా కరపత్రాలు అచ్చు వేయించి ప్రచారం చేస్తూ సంతకాలను సేకరించారు. దీనిపై తితిదే ఏర్పాటుచేసిన కమిటీ కూడా అధ్యయనం చేసింది.

ఇది నా జీవితాశయం

హనుమంతుడు తెలుగువాడని తిరుమల అంజనాద్రిపైనే జన్మించాడని నిరూపించడం నా జీవితాశయం. ఇందుకోసం దశాబ్దాలుగా పోరాడుతున్నాను. ఇన్నాళ్లకు కల నెరవేరబోతుంది. జాపాలీ తీర్థంలో భవ్యమందిర నిర్మాణం చేపట్టాలనేది నా ఆకాంక్ష.

- డాక్టర్‌ అన్నదానం చిదంబర శాస్త్రి

ఇదీ చదవండి:

తిరుమలలో కరోనా నియమాలు పకడ్బందీగా అమలు

ABOUT THE AUTHOR

...view details