జూన్, జూలై నెలలు విద్యార్థులకు అత్యంత కీలకమైనవి. పరీక్షలు పూర్తిచేసి పై చదువులకు వెళ్లేవారు కొందరైతే... ఉద్యోగాల కోసం ప్రయత్నాలు జరిపేవారు మరికొందరు. ఇందులో భాగంగానే అభ్యర్థులు... ఎంప్లాయిమెంట్ కార్యాలయాల చుట్టూ బారులు తీరి కనిపించేవారు. ఏడాది పొడవునా రిజిస్ట్రేషన్లు, రెన్యూవల్స్ కోసం వచ్చే అభ్యర్థులతో కార్యాలయాలు సందడిగా ఉండేవి. ఇక్కడ పనిచేసే సిబ్బంది కూడా ఏప్రిల్, మే నుంచి నాలుగైదు నెలల పాటు తీరిక లేకుండా గడుపుతుంటారు. ఈ ఏడాది కరోనా దెబ్బకు ఉపాధి కార్యాలయాల్లో ఇలాంటి పరిస్థితులేవీ కనిపించడం లేదు.
కరోనా భయానికి సిబ్బంది కార్యాలయాలకు సరిగా హాజరుకాలేకపోతుంటే... అభ్యర్థులు కూడా రాలేని పరిస్థితి నెలకొంది. పరీక్షలు, ఫలితాలు వాయిదా పడుతూ వస్తుండటంతో పేర్లు నమోదు చేసుకునేవారి సంఖ్య గణనీయంగా పడిపోయింది. రవాణా సౌకర్యాలు సరిగా లేకపోవడం వల్ల కూడా కొందరు కార్యాలయాలకు రాలేకపోతున్నారు. దీనికి తోడూ ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్లు పెద్దగా రాకపోతుండటం వల్ల కూడా అభ్యర్థులు కార్యాలయాలకు వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు.