అమ్మా టిఫిన్ తీసుకువస్తా అని చెప్పి.. బయటకు వెళ్లిన ఆ కుమారుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని తెలిసిన కన్నపేగు తల్లడిల్లిపోయింది. కుమారుడిపై మృతదేహం వద్ద రహదారిపైనే పడుకొని గుండెలవిసేలా రోదించింది. ఈ ఘటన ప్రకాశం జిల్లా కనిగిరి మండలం తమటంవారిపల్లి వద్ద జరిగింది.
నా బంగారు తండ్రీ... తిరిగి రా అయ్యా - recent accident at thamatamvaripalli news
అల్పాహారం తీసుకువస్తానని వెళ్లిన బిడ్ఢ.. లారీ ఢీకొట్టడంతో తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడని తెలిసి ఆ తల్లి గుండెలవిసేలా రోదించింది. ‘నా బంగారు తండ్రీ... తిరిగి రా అయ్యా... నువ్వు లేకుండా బతకలేమయ్యా... అంటూ దిక్కులు పిక్కటిల్లేలా దుఃఖిస్తూ బిడ్డ మృతదేహాన్ని పట్టుకుని విలపించింది. ఈ దృశ్యాలు చూపరులను సైతం కన్నీరు పెట్టించాయి. ఈ హృదయ విదారక సంఘటన ప్రకాశం జిల్లా కనిగిరి మండలం తమటంవారిపల్లి హైవే వద్ద జరిగింది.
తమటంవారిపల్లి గ్రామానికి చెందిన ఆకుల వెంకటరెడ్డి, వెంగమ్మల కుమారుడు వంశీ(15) తన కుటుంబసభ్యులకు అల్పాహారం తీసుకొచ్చేందుకు మోపెడ్‌పై రావిగుంటపల్లి వచ్చాడు. తిరిగి ఇంటికి వెళుతుండగా పామూరు వైపు నుంచి వస్తున్న కూరగాయల లారీ వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలై వంశీ అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రమాద విషయం తెలిసి మృతదేహం వద్ద తల్లి వెంగమ్మ, తండ్రి వెంకటరెడ్డి, చెల్లి, ఇతర కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదించారు. బిడ్డ కోసం వెంగమ్మ విలవిల్లాడిపోయారు. వంశీ మృతదేహాన్ని తడిమి తడిమి చూసుకుంటూ... రహదారిపైనే పడుకుని దీనంగా రోదించారు. ఆ మాతృమూర్తిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు. వంశీ కనిగిరిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. కరోనా సెలవుల కారణంగా ఇంట్లోనే ఉంటూ అమ్మానాన్నలకు చేదోడువాదోడుగా ఉంటున్నాడు. లారీ డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతో పాటు అతి వేగంతో వచ్చి ఢీకొట్టడంతో మృతి చెందాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బాలుని మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం కనిగిరి కమ్యూనిటీ వైద్యశాలకు తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్సై జి.రామిరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ పరారీలో ఉన్నాడు. బాలుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకొన్నాయి.
ఇదీ చదవండి:జలమే జీవనం.. పల్లెలు పరవశం