Eenadu-ETV Awareness on Right to Vote :భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ఎలా సద్వినియోగం చేసుకోవాలి. 18 ఏళ్లు నిండిన ప్రతి విద్యార్థి ఓటు హక్కును ఏ విధంగా పొందాలి అనే అంశాలపై ఈటీవీ భారత్, ఈటీవీ, ఈనాడు నిర్వహిస్తున్న అవగాహన సదస్సుకు విశేష స్పందన లభిస్తోంది. ఓటు నమోదు, చైతన్యంపై అవగాహన కల్పించడమే కాకుండా యువత సందేహాలను తీర్చుతూ ప్రజాస్వామ్య ప్రభుత్వ ఏర్పాటులో వారిని భాగస్వాములు చేసేందుకు ప్రయత్నిస్తోంది.
యువత రాజకీయాల్లోకి రావాలి :కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని వీవీ ఫార్మసిటికల్ కళాశాలలో ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓటరు అవగాహన సదస్సులో విద్యార్థులు ఓటు అని అక్షర రూపంలో నిలబడి ఓటు ప్రాధాన్యతను తెలియజేశారు. అనంతరం ఓటు నమోదు చేసుకున్నారు. గుంటూరు జిల్లా నంబూరు వీవీఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన సదస్సులో యువత రాజకీయాల్లోకిరావాలని వక్తలు సూచించారు. బాధ్యతాయుత నాయకుడ్ని ఎన్నుకుంటామంటూ విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. దేశ పురోభివృద్ధిలో మేము సైతం భాగస్వాములు అవుతామని గురజాలలోని నవోదయ కళాశాల విద్యార్థులు ఓటు నమోదు చేసుకున్నారు.
రైట్ టు ఓట్ - ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఉత్సాహంగా ఉన్న యువత
ప్రజాస్వామ్య రక్షణ కోసం ఓటు హక్కు :ప్రకాశం జిల్లా కనిగిరిలోని ఏబీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విద్యార్థులకు ఓటు నమోదుపై అవగాహన కల్పించారు. ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల సదస్సులో ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్య రక్షణ కోసం ఓటు హక్కు కలిగి ఉండాలని వక్తలు సూచించారు. కడపలోని శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన ఓటు అవగాహన సదస్సులో ఓటు నమోదుకు విద్యార్థులు పెద్ద ఎత్తున ఆసక్తి కనబరిచారు.