Power Cut Problems: విద్యుత్ సంక్షోభం వేళ ప్రభుత్వం ప్రకటించిన పవర్‌హాలిడేతో పరిశ్రమలు సతమతం అవుతున్నాయి. చిన్న, మధ్య తరహా పరిశ్రమల నిర్వాహకులు వాటిని ఎలా నడపాలో అర్థంకాక తలలుపట్టుకుంటున్నారు. పూర్తిస్థాయిలో పనిలేకపోవడంతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. పవర్‌హాలిడేలతో ప్రకాశం జిల్లా గుల్లాపల్లి గ్రోత్ సెంటర్‌లో ఉన్న వందలాది పరిశ్రమల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఇక్కడ గ్రానైట్ , ప్లాస్టిక్, కెమికల్, ఫార్మా వంటి పలు చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఉన్నాయి. రెండేళ్ళుగా కరోనాతో ఇవన్నీ దాదాపు మూతపడిన పరిస్థితి నెలకొంది. ఎగమతులు లేక ఆర్డర్లు రాక, ముడిసరకు దొరక్క నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అరొకర ఉత్పత్తులను మార్కెట్ చేసుకోలేక సతమతమయ్యారు. ఈ ఏడాది ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కి కాస్త ఊరట లభిస్తుందనుకున్న సమయానికి విద్యుత్తు పంపిణీలో కోత వీరి వ్యాపారాలపై పిడుగుపడ్డట్టు అయ్యింది..
విద్యుత్తు కొరత కారణంగా ఇక్కడి పరిశ్రమలకు ప్రతి బుధవారం పవర్‌హాలిడే ప్రకటించారు. ఓ రోజు వీక్లీ ఆఫ్ అంటూ వారానికి 2రోజులు విద్యుత్తు సరఫరాను నిలిపివేస్తున్నారు. కరోనా సంక్షోభం నుంచి కోలుకున్న తమకు ప్రభుత్వ నిర్ణయం శరాఘాతంగా మారిందని వ్యాపారులు వాపోతున్నారు. గ్రానైట్ పరిశ్రమలో ఎక్కువుగా కాంట్రక్టు సిబ్బందే పనిచేస్తుంటారు. వారంతా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారే. కోతలతో పూర్తిస్థాయిలో పనిలేకపోవడంతో వారు తిరిగి తమ స్వస్థలాలకు వెళ్లిపోతున్నారని నిర్వాహకులు చెబుతున్నారు.రసాయన పరిశ్రమలు, ప్లాస్టిక్ పరిశ్రమలకు తమ లోడ్‌లో 50 శాతం వినియోగించుకోవాలనే నిబంధన తీవ్ర ప్రతిబంధకంగా మారింది.