కృష్ణా బ్యాక్ వాటర్, కొల్లంవాగు వద్ద నిర్మిస్తున్న హెడ్ రెగ్యులేటర్ నుంచి 2 సొరంగాల ద్వారా దాదాపు 43 టీఎంసీల నీటిని తోడి కరవు ప్రాంతాలకు సాగు, తాగునీరు ఇవ్వాలన్నదే వెలిగొండ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రకాశం జిల్లాలో 23 మండలాలకు 3.36 లక్షల ఎకరాలకు సాగునీరివ్వాలి. నెల్లూరు, కడప కలిపి 7 మండలాల్లో దాదాపు లక్ష ఎకరాలతో పాటు, మొత్తంగా 15.20 లక్షల మంది ప్రజలకు తాగునీరు ఇవ్వాలన్నది ప్రణాళిక.
రైతుల పోరాటాలపై పట్టింపేదీ?
ఈ ప్రాజెక్టు పనులు త్వరలో పూర్తిచేసి, నీటిని విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే ఒకటో టన్నెల్ పూర్తయ్యింది. అంతవరకూ బాగానే ఉంది. అయితే.. జిల్లాలో కరవు పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని నిర్మిస్తున్న ప్రాజెక్టు అయినా.. కొన్ని ప్రాంతాలకు తాగు, సాగునీరు అందే పరిస్థితి కనిపించడం లేదు. ప్రధానంగా అత్యల్ప వర్షపాతం, తీవ్ర కరవు పరిస్థితులు ఉన్న పొదిలి, మర్రిపూడి మండలాలకు నీటిని పంపిణీ చేసే ప్రణాళికలు లేవు. ఈ విషయంపై ఆయా ప్రాంతాల రైతులు ఎన్నాళ్ల నుంచో పోరాడుతున్నా... పట్టించుకున్న దాఖలాలు లేవు.
2 మండలాల్లో బీళ్లుగా మారిన సాగుభూములు