ప్రకాశం జిల్లా కనిగిరి నగర పంచాయతీలో రోజులు, నెలలు కాదు.. ఏడాది పొడవునా.. నీటి కొరతే. వర్షాకాలమైనా ఆ ప్రాంతంలో తాగునీటికి ఎద్దడే. ఇంత ఇబ్బంది పడుతున్నా.. తమ సమస్యను పట్టించుకునే అధికారులు, నాయకులు లేరని నగర పంచాయతీలోని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనిగిరి నగర పంచాయతీ పరిధిలోని రజక వీధి, టకారిపాలెం, దేవాంగనగర్, అర్బన్ కాలనీ, కాశిరెడ్డి నగర్, బొగ్గుల గొందికాలనీల లాంటి శివారు ప్రాంతాల్లో తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఆ ప్రాంతాల్లో.. కనీసం వారానికి ఓ సారి ట్యాంకర్ తో నీటిని సరఫరా చేస్తున్నారు. అది ఏ మాత్రం సరిపోవట్లేవని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. గడిచిన నాలుగేళ్లలో తమ ప్రాంతంలో వర్షాలు లేక.. భూగర్భజలాలు అడుగంటాయని.. బోర్లలో ఎక్కడా చుక్క నీరు రాక గుక్కెడు నీరు కోసం నానాకష్టాలు పడాల్సివస్తోందని వాపోయారు.