ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'జలజీవన్ మిషన్ కింద.. ప్రతి ఇంటికీ తాగునీరు అందించడమే లక్ష్యం' - ప్రకాశం జిల్లా తాజా వార్తలు

ప్రకాశం జిల్లాలో 5.09 లక్షల గృహాలకు ట్యాప్ కనెక్షన్ల ద్వారా తాగునీరు సరఫరా చేయడానికి ప్రణాళిక రూపొందించినట్లు కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. జలజీవన్ మిషన్ కింద గ్రామాల్లోని ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీరు అందించడమే లక్ష్యంతో పనిచేస్తున్నామని కలెక్టర్ తెలిపారు.

జిల్లా స్థాయి ప్రణాళిక కమిటీ సమావేశం
జిల్లా స్థాయి ప్రణాళిక కమిటీ సమావేశం

By

Published : Jul 6, 2021, 7:41 PM IST

గ్రామీణ ప్రాంతాల్లో 5.09 లక్షల గృహాలకు ట్యాప్ కనెక్షన్ల ద్వారా తాగునీరు సరఫరా చేయడానికి ప్రణాళిక రూపొందించామని ప్రకాశం జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. జల జీవన్ మిషన్ కింద గ్రామీణ నీటి సరఫరాపై జిల్లా స్థాయి ప్రణాళిక కమిటీ సమావేశం జరిగింది. ఈ మిషన్ కింద గ్రామాల్లో ప్రతి గృహానికి సురక్షితమైన తాగునీరు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం 5.09 లక్షల గృహాలకు నీరు అందించేందుకు... రూ.889.44 కోట్లతో ప్రణాళిక రూపొందించి ప్రభుత్వానికి నివేదించామని చెప్పారు. నీటి సరఫరా వ్యవస్థ నిర్మాణం కోసం రూ.36.97 కోట్లతో ప్రణాళిక రూపొందించగా, రూ.490.20 కోట్లతో పైప్ లైన్ల నిర్మాణం చేపట్టాలని, రూ.190.70 కోట్లతో ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మించాలని ప్రణాళిక రూపొందించామని అన్నారు.

నూతనంగా నీటి వనరుల ఏర్పాటు కోసం రూ.56.17 కోట్లు, కొత్తగా ట్యాంకులు నిర్మించడానికి రూ.44.41 కోట్లు, మరో రూ.70.99 కోట్లు అనుబంధంగా వివిధ పనులకు నిధులు వెచ్చించాలని సమగ్ర ప్రణాళికను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించిన విషయాలను ఆయన వివరించారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం స్పందించిందని... జల జీవన్ మిషన్ కింద 2024 సంవత్సరం వరకు రూ 527.17 కోట్లు మంజూరు చేస్తూ అధికారికంగా అనుమతులిచ్చిందని చెప్పారు.

జల వనరులు తక్కువగా ఉన్న ప్రకాశం జిల్లాలో తాగునీటి సమస్యలు రాకుండా అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని కలెక్టర్ చెప్పారు. అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకునేలా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జల జీవన్ మిషన్ కింద రానున్న మార్చి నాటికి ఒక లక్ష, 62వేల, 330 గృహాలకు నీటి కనెక్షన్ లు ఇవ్వడానికి రూ.227.27 కోట్లు వెచ్చించాలని ప్రణాళిక రూపొందించినట్లు ఆయన వివరించారు. ఈ పనులు ఇప్పటివరకు 11.66 శాతం పురోగతిలో ఉన్నాయన్నారు. గడిచిన మూడు నెలలలో రూ.3.03 కోట్ల నిధులు వెచ్చించి 18,930 గృహాలకు ట్యాప్ కనెక్షన్లు ఇచ్చామని చెప్పారు. వేగంగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాలలో నీటి సమస్యలను గుర్తించి తక్షణమే పరిష్కరించాలని సూచించారు.

గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలకు జల జీవన్ మిషన్ కింద స్వచ్ఛమైన తాగునీరు అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. తాగునీటి సరఫరాలో ఆటంకాలు లేకుండా చూడాలన్నారు. పైపులైన్ల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఆయన సూచించారు. నిర్మాణ పనుల పరిశీలనకు సచివాలయాల ఇంజినీరింగ్ అసిస్టెంట్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చామన్నారు. వారంతా నిరంతరం పర్యవేక్షించేలా చూడాలన్నారు. ప్రజలకు సరఫరా చేస్తున్న తాగునీటి నాణ్యతను గుర్తించే ల్యాబ్ లు సమర్థంగా పనిచేయాలన్నారు. గతేడాది లక్ష్యంలో 65.04 శాతం పురోగతి సాధించిన విషయాలను ఆయన గుర్తు చేశారు. రూ.260.19 కోట్ల నిధులతో 95,456 గృహాలకు ట్యాప్ కనెక్షన్ లు ఇవ్వగలిగామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఆర్​డబ్ల్యూఎస్ ఎస్ఈ మర్థన్ఆలీ, జడ్పీ సీఈఓ దేవానందరెడ్డి, డ్వామా పీడీ. శీనారెడ్డి, డిఆర్డీఏ పిడి బి.బాబురావు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

kambhampati: మిజోరాం రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తా: కంభంపాటి

ABOUT THE AUTHOR

...view details