ప్రస్తుతం గ్రంథాలయాల ప్రభావం చాలా వరకు తగ్గింది. నిర్వహణ లేక.. పాఠకులు రాక మూతపడ్డ గ్రంథాలయాలు చాలా వరకు ఉన్నాయి. ప్రకాశం జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెంలోని యువజన గ్రంథాలయం మాత్రం వీటికి భిన్నం. మారుతున్న కాలానికి అనుగుణంగా రూపు మార్చుకుని.. విద్యార్థులు, యువత అవసరాలు తీరుస్తోంది. దీని వెనుక స్థానిక విశ్రాంత ఉద్యోగుల కృషి ఉంది. ప్రణాళికాబద్ధంగా నిర్వహణ చేపడుతూ... నేటి అవసరాలకు తగ్గట్టుగా గ్రంథాలయాన్ని తీర్చిదిద్దుతున్నారు.
1958లో ఈపూరుపాలెంలో కొందరు ఔత్సాహికులు ఈ గ్రంథాలయాన్ని స్థాపించారు. గత రెండు దశాబ్దాలుగా విశ్రాంత ఉద్యోగుల సంఘం దీని నిర్వహణను చూస్తోంది. పోటీపరీక్షలకు ఇతర రంగాలకు సంబంధించిన పుస్తకాలతో పాటు ,దిన పత్రికలను అందుబాటులో ఉంచుతున్నారు. స్థానికుల నుంచి అభిప్రాయాలు సేకరించి.. మారిన కాలానికి అనుగుణంగా డిజిటల్ గ్రంథాలయానికి శ్రీకారం చుట్టారు. అప్పటివరకు సంఘం అధ్యక్షుడిగా పడవల లక్ష్మణస్వామి కొనసాగారు. వారి కుమారుడు జలవనరులశాఖ విశ్రాంత చీఫ్ ఇంజినీర్ పీబీఎన్ వరప్రసాద్ తండ్రి జ్ఞాపకార్థం ఎల్ఈడీ టీవీ, ఇతర పరికరాలు, బల్లలు సమకూర్చారు.