నివర్ తుపాను కారణంగా కురిసిన వర్షాలకు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గంలో దెబ్బతిన్న పంటలను.. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుతో కలిసి ఆదివారం పరిశీలించారు. చిననందిపాడు వద్ద వరద ముంపునకు గురైన మిర్చి, వైట్‌బర్లీ పొగాకు పైర్లను పరిశీలించి.. నష్టంపై రైతులను అడిగి తెలుసుకున్నారు.
'ఈ-పంట సాకుతో అన్యాయం చేయొద్దు'
భారీ వర్షాలతో నష్టపోయిన రైతులను సీఎం పరామర్శించకుండా.. హెలికాప్టర్లో తిరగటం దారుణమని దేవినేని ఉమా అన్నారు. ప్రకాశం జిల్లా పర్చూరు మండలం చిన నందిపాడులో నివర్ తుపాను ప్రభావంతో దెబ్బతిన్న మిరప పంట పొలాలను మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావులు పరిశీలించారు.
రైతులకు ఉచితంగా విత్తనాలు, ఎరువులు పంపిణీ చేయాలని దేవినేని ఉమా ప్రభుత్వాన్ని కోరారు. కష్టాల్లో ఉన్న రైతులను కలిసి వారిలో మనోధైర్యం నింపాల్సిన వ్యవసాయ మంత్రి ఎక్కడ అని ప్రశ్నించారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, ఈ- పంట నమోదు సాకుతో రైతులకు అన్యాయం చేయకుండా క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిహారం ఇవ్వాలని అన్నారు. మిర్చి రైతులకు పెట్టుబడిలో కనీసం 50 శాతం పరిహారంగా చెల్లించాలని ఎమ్మెల్యే ఏలూరి డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: రాజస్థాన్లో ప్రకాశం పోలీసులపై దాడులు..!