ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఆ హత్య కేసుల్లో వారే దోషులు... ఈ నెల 20న శిక్ష ఖరారు..

By

Published : May 18, 2021, 10:07 PM IST

ప్రకాశం జిల్లాలో 2008లో సంచలనం సృష్టించిన హత్య కేసుల్లో నిందితులను దోషులుగా నిర్ధరిస్తూ ప్రకాశం జిల్లా 8వ అదనపు సెషన్స్‌ కోర్టు తీర్పు వెలువరించింది. వరుస హత్య కేసుల్లో ప్రధాన నిందితుడు మున్నాతో పాటు, మరికొంత మంది నిందితులు నేరస్థులుగా నిర్ధరణ కావటంతో వారిని దోషులుగా ప్రకటించింది.

Defendants convicted in chain murder cases
గొలుసు హత్య కేసుల్లో దోషులుగా తేలిన నిందితులు

ప్రకాశం జిల్లాలో 2008లో సంచలనం సృష్టించిన హత్య కేసుల్లో నిందితులను దోషులుగా నిర్ధరిస్తూ ప్రకాశం జిల్లా 8వ అదనపు సెషన్స్‌ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసుకు సంబంధించి ఈనెల 20న న్యాయస్థానం శిక్ష ఖరారు చేయనుంది. వరుస హత్య కేసుల్లో ప్రధాన నిందితుడు మున్నాతో పాటు, మరికొంత మంది నిందితులు నేరస్థులుగా నిర్ధరణ కావటంతో వారిని దోషులుగా ప్రకటించింది.

ఏం జరిగిందంటే...

కోల్​కతా-చెన్నై 16వ నెంబర్‌ జాతీయ రహదారిలో 2008వ సంవత్సరంలో కొన్ని లారీలు, వాటిలో ఉన్న సరుకు అదృశ్యం కేసులు నమోదయ్యాయి. ఈ కేసు విషయంలో అప్పటి ట్రైనీ డీఎస్పీగా పనిచేసిన దామోదర్‌కు చిన్న ఆధారం లభించింది. దీనిపై లోతుగా దర్యాప్తు చేస్తే ఒళ్లు గగుర్పాటుకు గురిచేసే సంఘటనలు వెలుగు చూసాయి. ఒంగోలుకు చెందిన అబ్ధుల్‌ సమ్మద్‌ అలియాస్‌ మున్నా ఒక గ్యాంగ్‌ను తయారు చేసుకున్నాడు. అంతకు ముందు గుప్తనిధులు ఆచూకీ చెపుతానని కొంతమంది ధనవంతులను నమ్మించి, వారి వద్దనుంచి భారీగా డబ్బులు వసూలు చేసే వాడు. దీనివల్ల ప్రయోజనం లేదని దారి దోపిడీలకు పాల్పడటం ప్రారంభించాడు.

అధికారిగా అవతారమెత్తి..

జాతీయ రహదారిపై అధికారిలా కాపు కాసి, లోడులతో ఉన్న లారీలను ఆపడం, రికార్డులు చూపించాలని కోరటం అదును చూసి మెడలో నైలాన్‌ తాడు వేసి బిగించి హతమార్చడం చేసేవాడు. మృతదేహాలను గోతాల్లో కుక్కి , తోటల్లో, అటవీ ప్రాంతాల్లో పాతిపెట్టి, లారీని, సరుకును మాయం చేసేవారు. మద్దిపాడులో ఓ పాడుపడ్డ గోడౌన్‌ను అద్దెకు తీసుకొని అక్కడ లారీని తుక్కుగా మార్చి, సరుకును విక్రయించి సొమ్ముచేసుకునేవారు.

మెుత్తం 13 హత్యలు

ఇలా ఈ రహదారిలో దాదాపు 13 మందిని హత్య చేసాడు. ట్రైనీ డీఎస్పీ దర్యాప్తులో ఈ విషయం బయటపడింది. మున్నాను, అతని అనుచరులను అప్పట్లో అరెస్టు చేసారు. అనంతరం నిందితుడు మున్నాకు బెయిల్‌ రావడంతో బెంగుళూరుకు వెళ్ళిపోయాడు. కొద్దిరోజుల తర్వాత కర్నూలు పోలీసులు అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మున్నా, అతని గ్యాంగ్‌ మీద ఏడు కేసులు నమోదయ్యాయి. ఈ కేసును ప్రకాశం జిల్లా 8వ అదనపు జిల్లా సెషన్స్‌ కోర్టులో వాద ప్రతివాదనలు జరిగాయి.

ఇందులో భాగంగా ఈ రోజు జరిగిన వాయిదాలో నాలుగు కేసులకు సంబంధించి నేరాలు రుజువు కావడంతో దోషులుగా నిర్ధరించారు. ఇందుకు సంబంధించి ఈ నెల 20న శిక్ష ఖరారు చేయనున్నారు.

ఇదీచదవండి: బ్లాక్ ఫంగస్ ఎఫెక్ట్: రాష్ట్రంలో 5 మరణాలు.. పెద్దసంఖ్యలో కేసులు

ABOUT THE AUTHOR

...view details